పెంచిన టికెట్ల రేట్లలో 20 పర్సంట్ కట్టాల్సిందే

ఒకప్పటితో పోలిస్తే తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపుకి సంబంధించి అంత తేలిగ్గా జీవోలు రావట్లేదు. ఓవైపు ప్రభుత్వం అంత తేలిగ్గా జీవోకు అంగీకరించట్లేదు. ఇంకోవైపు కోర్టుల్లో చిక్కులు ఎదురవుతున్నాయి. అయినా సరే గత ఏడాది కాలంలో కొందరు నిర్మాతలు గట్టిగా ప్రయత్నించి అదనపు రేట్లకు అనుమతులు తెచ్చుకున్నారు. ఆ జీవోల ద్వారా ప్రయోజనమూ పొందారు. 

కానీ అంతటితో సంబరం అయిపోలేదు. అదనపు రేట్ల ద్వారా వచ్చిన ఆదాయంలో 20 శాతం ఇప్పుడు ప్రభుత్వానికి చెల్లించక తప్పట్లేదు. ఈ మొత్తాన్ని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు చెల్లించాలంటూ తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సినీ కార్మికుల సంక్షేమం కోసం ఈ నిధులు ఉపయోగిస్తామని ప్రభుత్వం పేర్కొంది.

టికెట్ల రేట్ల పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 పర్సంట్ సినీ కార్మికుల సంక్షేమానికి చెల్లించాల్సి ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకుముందే ఒక కార్యక్రమంలో స్పష్టం చేశారు. ఐతే సీఎం నోటి మాటగా చెప్పిన దాన్ని సినీ నిర్మాతలు పెద్దగా పట్టించుకున్నట్లుగా లేదు. ఇలా ఆదాయంలో వాటాను వెనక్కి ఇచ్చారా లేదా అని ఎవ్వరూ పరిశీలించే ప్రయత్నం కూడా చేయలేదు. ఐతే సీఎం మాట ఇప్పుడు ఉత్తర్వులుగా మారింది. 

గత ఏడాది వ్యవధిలో ధరల పెంపు ద్వారా ప్రయోజనం పొందిన అఖండ-2, ది రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు, పెద్ది లాంటి సినిమాలకు సంబంధించి ఎగ్జిబిటర్ల నుంచి 20 శాతం వాటాను వసూలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ మొత్తాన్ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. మరి ఈ ఆదేశాలపై నిర్మాతలు ఏం చేస్తారో చూడాలి.