సినీ హీరోల మీద ఫ్యాన్స్ వీరాభిమానానికి సంబందించి ఎన్నో ఉదంతాలు చూశాం. కానీ ఇది చాలా చిత్రమైన వ్యవహారం. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శశిభవ్యత అనే అమ్మాయి లాఫోరా మయోక్లోనిక్ ఎపిలెప్సీ అనే అరుదైన జన్యు పరమైన వ్యాధితో బాధ పడుతోంది. తరచూ ఫిట్స్ రావడం, నాడీ వ్యవస్థ దెబ్బ తినడంతో మంచానికే పరిమితం అయిన 18 ఏళ్ల ఈ అమ్మాయికి టాలీవుడ్ యువ కథానాయకుడు రామ్ అంటే వల్లమాలిన అభిమానం.
మతిస్థిమితం కూడా సరిగా లేని ఈ అమ్మాయికి రామ్ పేరు చెబితే.. ఒంట్లో ఉత్సాహం వస్తోంది. శశిభవ్యత తల్లిదండ్రులు.. ఆమెకు రామ్ వీడియోలు, ఫొటోలు చూపించి అన్నం తినిపించి మందులు వేస్తున్నారట. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత.. రామ్ దృష్టికి వచ్చింది.
ఈ అభిమాని పరిస్థితి చూసి కదిలిపోయిన రామ్.. వెంటనే స్పందించాడు. ఆ బాలికతో రామ్ వీడియో కాల్ మాట్లాడాడు. ఆమె తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాడు. శశిభవ్యతకు అవసరమైన మందులు, ఇతర ఖర్చులు అన్నీ ఇకపై తానే భరిస్తానని రామ్ తెలిపాడు. ఆమె రిపోర్టులు అన్నీ కూడా తనకు అందాయని.. ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు తన వంతుగా ప్రయత్నిస్తానని రామ్ చెప్పాడు.
శశిభవ్యతను సంతోషంగా ఉంచాలని, సరైన మందులు వాడాలని, అన్నీ సమయానికి అందేలా చూడాలని రామ్ సూచించాడు. శశిభవ్యత పరిస్థితిని వెలుగులోకి తెచ్చి తన దృష్టికి తీసుకొచ్చిన అభిమానులు, మీడియా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు రామ్ కృతజ్ఞతలు చెప్పాడు. తమ అమ్మాయి అభిమాన నటుడు ఇలా స్వయంగా స్పందించి భరోసా ఇవ్వడం పట్ల శశిభవ్యత తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates