‘పెద్ది’ తర్వాత బుచ్చిబాబు సానా నెక్స్ట్ సినిమా ఎవరితో అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ ఆయన దగ్గర ఉన్న హీరోల లిస్ట్ చూస్తే మాత్రం చిన్నది కాదు. ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రవితేజ గురించి మాట్లాడుతూ తాను జీవితంలో మొదట రాసుకున్న కథే ఆయన కోసమని బుచ్చిబాబు చెప్పాడు. ఇప్పటికీ ఆ కథ తన దగ్గరే ఉందని, రవితేజకు చెప్పాలని ఉందని చెప్పడంతో మరో కొత్త కాంబినేషన్ పేరు బయటకు వచ్చింది.
బుచ్చిబాబు ప్రయాణంలో ఇలాంటి కథలు ముందూ ఉన్నాయి. ‘ఉప్పెన’ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి కొంతకాలం ట్రావెల్ అయ్యాడు. అయితే అది ముందుకు వెళ్లలేదు. తర్వాత రామ్ చరణ్ దగ్గరకు ‘పెద్ది’ వెళ్లింది. ముఖ్యంగా ఎన్టీఆర్‌కు చెప్పిన కథనే చరణ్‌తో తీశాడనే ప్రచారాన్ని బుచ్చిబాబు స్వయంగా ఖండించాడు. రెండూ పూర్తిగా వేర్వేరు కథలని ఆయన క్లియర్ చేశాడు.
‘పెద్ది’ రిలీజ్ తర్వాత మళ్లీ ఎన్టీఆర్ పేరు వచ్చింది. తన దగ్గర మరో బలమైన కథ ఉందని చెప్పిన బుచ్చిబాబు, ఎన్టీఆర్ పిలిస్తే వెంటనే వెళ్లి కథ చెబుతానని కూడా అన్నాడు. ఇదే సమయంలో మహేష్ బాబు పేరు కూడా బుచ్చిబాబు చుట్టూ తిరిగింది. ‘పెద్ది’ టైమ్ లో మహేష్ కోసం ఉందా అని అడిగితే ఆయన కన్ఫర్మ్ చేయలేదు, అలాగని పూర్తిగా కొట్టిపారేయలేదు. సరైన టైమ్ కోసం వెయిట్ చేద్దామనే సమాధానం ఇచ్చాడు.
ఇప్పుడు రవితేజ పేరు కూడా ఈ లిస్ట్‌లోకి వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీటిలో ప్రతి హీరో కోసం ఒకే కథను తిప్పుతున్న పరిస్థితి కనిపించడం లేదు. ఎన్టీఆర్ కథ వేరు అని బుచ్చిబాబు చెప్పాడు. రవితేజ కోసం మొదట్లోనే రాసుకున్న మరో కథ ఉంది. ‘పెద్ది’ని రామ్ చరణ్ కోసమే రాసుకున్నానని కూడా చెప్పాడు. అంటే ఆయన కథల బ్యాంక్ ముందే తయారై ఉన్నట్టుంది. ‘ఉప్పెన’ తర్వాత రెండో సినిమా రావడానికి బుచ్చిబాబుకు ఐదేళ్లు పట్టింది. ఇప్పుడు ‘పెద్ది’ తర్వాత మళ్లీ అంత గ్యాప్ రావాలని ఆయన కూడా కోరుకోకపోవచ్చు. మరి నెక్స్ట్ ఎవరితో ఫిక్స్ అవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates