థియేటర్లకు భలే చిక్కు వచ్చి పడింది

టాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉందంటే అయితే అతివృష్టి లేదా అనావృష్టి లాగా మారిపోయింది. జనవరి తర్వాత రెండు మూడు నెలలు థియేటర్లు ఎంత డ్రైగా ఉన్నాయో చూశాం. వారాల తరబడి సరైన సినిమాలు లేక కొన్ని చోట్ల షోలు రద్దు చేయడం, మరికొన్ని చోట్ల స్క్రీన్లను తాత్కాలికంగా మూసేయడం జరిగాయి. పెద్ది నుంచి సీన్ మారిపోయింది. మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ ఇలా వరుసగా హిట్లు పడి జనాలతో హాళ్లు కళకళలాడాయి. ఇదంతా ఒక ఎత్తు.

ఇప్పుడు ఇండిపెండెన్స్ డే సందర్భంగా బిసి సెంటర్లలో థియేటర్లు, షోలు సర్దుబాటు చేయడం ఎగ్జిబిటర్లకు పెద్ద సమస్యగా మారిపోయింది. ఎందుకంటే ఇవాళ విశ్వనాథ్ అండ్ సన్స్ ఏపీ తెలంగాణలో పాజిటివ్ టాక్ తో మొదలయ్యింది. పళ్ళబురుసు వెనుక అన్నపూర్ణ సంస్థ ఉండటం వల్ల అవసరమైన స్క్రీన్లు దక్కించుకున్నారు. అగధకు ఉన్నంతలో సర్దుబాటు చేశారు. హుషారు పిట్టలు టాక్ వస్తేనే కౌంట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అసలు సమస్య ఇవి కాదు. .

గత వారం రిలీజైన సినిమాల్లో డిసి రెండో వారంలోనూ స్ట్రాంగ్ గా ఉంది. తమిళం కంటే తెలుగు జనాలు బాగా చూస్తున్నారు. మెయిన్ సెంటర్స్ అన్నింటిలోనూ చెప్పుకోదగ్గ హోల్డ్ తో సెకండ్ వీక్ కొనసాగుతోంది. దీనంత కాకపోయినా కొరియన్ కనకరాజు డీసెంట్ గా నెట్టుకొస్తోంది. వీకెండ్ మళ్ళీ పికప్ అవుతుందని బయ్యర్లు వెయిట్ చేస్తున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఇప్పట్లో నెమ్మదించను అంటున్నాడు. ది ఒడిస్సి మాత్రమే దాదాపుగా ఫైనల్ రన్ పూర్తి చేసుకుంది.

ఇక్కడితో అయిపోలేదు. ఇమ్రాన్ హష్మీ ఆవారాపన్ 2 కోసం మల్టీప్లెక్సుల నుంచి ఎక్కువ డిమాండ్ ఉంది. ఉన్న తక్కువ షోలు వేగంగా ఫుల్స్ పడుతున్నాయి. సన్నీ డియోల్ బట్వారా మీద ఏమంత బజ్ లేకపోయినా మంచి రిలీజ్ ఇచ్చారు. విశాల్ మకుటం కనీస సౌండ్ చేయకపోవడంతో ఓపెనింగ్ పెద్దగా వచ్చేలా లేదు. ఇది వేరే సినిమాలు వాడుకునే అవకాశం లేకపోలేదు. వచ్చే వారం ఇరుముడి వస్తుంది. ఈలోగా పైన చెప్పిన వాటిలో రెండు మూడు ఫైనల్ రన్ వచ్చేస్తాయి కాబట్టి టెన్షన్ ఉండదు.