బాక్సాఫీస్ ట్విస్ట్… సాహో జంట క్లాష్

బాక్సాఫీస్ ఫలితం ఏంటనేది పక్కనపెడితే యాక్షన్ సినిమాల్లో విజువల్ గ్రాండియర్ నెస్ తీసుకొచ్చిన మూవీగా సాహోకి ప్రత్యేక స్థానం ఉంటుంది. మన దగ్గర భీకరంగా ఆడలేదు కానీ హిందీలో ఓ మోస్తరు కలెక్షన్లతో బాగానే బండి లాగింది. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ దీంతో పెద్ద బ్రేక్ అందుకుని తెలుగులో అవకాశాలు దక్కించుకోవాలని చూసింది కానీ ఆశ నెరవేరలేదు. దీంతో ముంబైకే పరిమితమై అక్కడే బిజీ అయిపోయింది. ప్రభాస్ తో జంటగా నటించిన జ్ఞాపకాన్ని భద్రపరుచుకుంది.

ఇక అసలు పాయింటుకొస్తే ప్రభాస్, శ్రద్ధ కపూర్ డిసెంబర్ మొదటి వారంలో ఒకరితో ఒకరు బాక్సాఫీస్ క్లాష్ లో తలపడబోతున్నారు. మూడో తేదీని ఫౌజీ ఆల్రెడీ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ అధికార ప్రకటన ఇచ్చి వారాలు గడిచాయి. తాజాగా ఒక రోజు ఆలస్యంగా డిసెంబర్ 4న ఈధ ని రిలీజ్ చేయబోతున్నట్టు మాడాక్ ఫిలిమ్స్ అఫీషియల్ గా ప్రకటించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం రెండూ పీరియాడిక్ డ్రామాలే. ఒకటి ఫిక్షన్ మరొకటి బయోపిక్.

ఇలా జరగడం వల్ల ఎవరికి ఎక్కువ సమస్యో చూసుకుంటే శ్రద్ధకే కొంచెం రిస్క్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ ఇమేజ్, మార్కెట్, ఫాలోయింగ్, ఫౌజీ భారీతనం వగైరాలు దక్షిణాదిలో ఎక్కువ హైప్ తీసుకొస్తాయి. దీని వల్ల ఈధకి ఏపీ తెలంగాణ నుంచి కర్ణాటక వరకు కోరుకున్న ఓపెనింగ్స్ దక్కకపోవచ్చు. ఇక ప్రభాస్ వైపు చూసుకుంటే మాడక్ సంస్థ బలమైన నెట్ వర్క్ ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ స్క్రీన్లు లాక్ చేసుకుంటుంది. దీని వల్ల పంపకాల్లో ఇబ్బందులు వస్తాయి.

జానర్లు వేరు అయినా ప్రభాస్, శ్రద్ధల వార్ మాత్రం ఆసక్తికరంగా ఉండబోతోంది. ఫౌజీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. దర్శకుడు హను రాఘవపూడి చివరి షెడ్యూల్ కోసం అందరిని పరుగులు పెట్టిస్తున్నారు. నవంబర్ మొదటివారం లోగా గుమ్మడికాయ కొట్టేసి ప్రమోషన్ల కోసం కనీసం నెల రోజులు కేటాయించుకునే ప్లానింగ్ లో ఉన్నారు. ఇప్పుడు కాంపిటీషన్ లో ఈధ ఉంది కాబట్టి నార్త్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకునేలా పబ్లిసిటీని వినూత్నంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.