అక్కడ అమితాబ్… ఇక్కడ రానా

టాలీవుడ్ విలక్షణ నటుడు దగ్గుబాటి రానా ఇంతకుముదులా వరుసగా సినిమాలు చేయడం లేదు. హీరోగా అయితే సినిమాలు పూర్తిగా ఆపేశాడు. విలన్, క్యారెక్టర్ రోల్స్ విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అప్పుడప్పుడూ ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తున్నాడు. చివరగా రానా పూర్తి స్థాయి పాత్ర చేసింది ‘వేట్టయాన్’లో.

అందులో సూపర్ స్టార్ రజినీకాంత్‌కు విలన్‌గా కనిపించాడు రానా. ఆ తర్వాత ‘మిరాయ్’లో క్యామియో రోల్ చేశాడు. కాంత, పరాశక్తి లాంటి చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపించాడు. ఆ తర్వాత రానా నటించే కొత్త సినిమా సంగతులేవీ వినిపించలేదు. ఐతే ఇప్పుడు ఒక క్రేజీ సీక్వెల్లో ఈ దగ్గుబాటి హీరో నటించబోతున్న విషయం వెల్లడైంది. ఆ చిత్రమే.. జై హనుమాన్.

2024 సంక్రాంతికి విడుదలైన సెన్సేషన్ క్రియేట్ చేసిన సోషియో ఫాంటసీ ఫిలిం ‘హనుమాన్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’లో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి హనుమంతుడి పాత్ర నేపథ్యంలో ఒక పురాణ గాథగా ఈ సినిమాను తెరకెక్కనున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. కాబట్టి ఇందులో చాలా పురాణ పాత్రలు కనిపించబోతున్నాయి. వాటిలో అశ్వథ్థామ పాత్ర కూడా ఒకటి. ఆ పాత్రలో దగ్గుబాటి రానా నటించనున్నాడట.

మహాభారతంలో ఎంతో కీలకంగా, శక్తిమంతంగా కనిపించే ఈ పాత్రకు రానా బాగా సూటవుతాడనడంలో సందేహం లేదు. విశేషమేంటంటే.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ఇదే టైంలో ఆ పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ‘కల్కి’లో ఆయనీ క్యారెక్టర్లో మెప్పించారు. ఆ సినిమాకు ఒక రకంగా ఆయనే హీరో. ఇప్పుడు ‘కల్కి-2’లోనూ ఆ పాత్ర కొనసాగబోతోంది. అమితాబ్ ఆ సినిమా చిత్రీకరణలోనూ పాల్గొంటున్నాడు. ఇలా అమతాబ్ లాంటి లెజెండరీ నటుడు ఒక ఐకానిక్ పాత్ర చేస్తుండగా.. అదే సమయంలో ఆ క్యారెక్టర్‌ను రానా పోషించబోతుండడం అరుదైన విషయమే.