జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది కానీ లేదంటే ఇలాంటి కంటెంట్ తో ఇంకో రెగ్యులర్ హీరో అయ్యుంటే పది కోట్లు కూడా దాటేది కాదేమో. తెలుగు రాష్ట్రాల్లో కూడా అంతో ఇంతో జనాలు థియేటర్లకు వెళ్లి చూశారంటే అది విజయ్ సంపాదించుకున్న ఫాలోయింగే. ఆరు నెలలుగా వాయిదా పడి, హెచ్డి ప్రింట్ ముందే లీకైపోయిన ఒక బిలో యావరేజ్ మూవీకి ఇంత స్పందన రావడం అనూహ్యం.
దీని సంగతలా ఉంచితే నిన్న ఆదివారం చెన్నైలో జన నాయకుడు ఆడుతున్న పలు థియేటర్లు మల్టీప్లెక్సుల మీద పోలీసులు రైడ్ చేశారు. ఏ సర్టిఫికెట్ ఉన్న సినిమాలకు 18 వయసు లోపల పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదు. కానీ కొన్ని చోట్ల చిన్న పిల్లలు ఉండటంతో వాళ్ళను తల్లితండ్రులతో సహా బయటకి పంపించేశారు. కొందరు వాదోపవాదాలు చేశారు కానీ చట్టపరంగా నిబంధనలు కఠినంగా ఉండటంతో ఏమీ చేయలేక ఇంటికి వెళ్లిపోయారు.
ఇక్కడ విజయ్ ప్రభుత్వ విధానాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి సినిమా ఆడుతుంటే దాని థియేటర్లకు వెళ్లి తనిఖీ చేయడం చాలా అరుదు. ఎందుకంటే అలా చేసే పనైతే స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు అడ్డు పడతారు. కానీ అలాంటిది ఏమి లేకుండా చెకింగ్ కు వెళ్లడం మంచి పరిణామం. మొదటి రోజు బ్లాక్ టికెట్లు విచ్చిలవిడిగా అమ్మినట్టు పలు వీడియోలు బయటికి రావడంతో థియేటర్ల మీద పోలీసులు పర్యవేక్షణ పెంచారు.
కాకపోతే విజయ్ చివరి సినిమా కాబట్టి ముఖ్యంగా తనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న పిల్లలు, యూత్ జన నాయగన్ ని థియేటర్లలో చూసేందుకు ఇష్టపడుతున్నారు. కానీ సెన్సార్ సర్టిఫికెట్ పెద్ద అడ్డంకిగా మారింది. గతంలో మాస్టర్ కు కూడా ఇదే సమస్య వచ్చింది కానీ ఆ టైంలో పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ఈసారి తన పాలనలోనే ఇలాంటి వాటికి అనుమతిస్తున్న టీవీకే పారదర్శకతని జనం మెచ్చుకుంటున్నారు. పిల్లలతో వెళ్లిన ఇంటికి తిరిగి వచ్చిన పేరెంట్స్ తప్ప.
Gulte Telugu Telugu Political and Movie News Updates
