వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా అందులోనూ మొదటిసారి సూపర్ స్టార్ కాంబినేషన్, ఇంతకన్నా ఎలివేషన్ ఇంకేముంటుంది. పైగా రెగ్యులర్ కమర్షియల్ డ్రామా కాకుండా అద్భుతమైన ఫాంటసీ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నారు. కేవలం టైటిల్ వీడియోతోనే అంచనాలు ఎక్కడికో ఇంటర్నేషనల్ లెవెల్ లో పైకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అందుకే ఇంత హైప్.

ఇదంతా ఓకే కానీ ఇంతకీ వారణాసి మాట తప్పకుండా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7 విడుదలవుతుందా లేదానే అనుమానాలు జనంలో లేకపోలేదు. ఎందుకంటే జక్కన్న మూవీస్ కి వాయిదాలు కొత్త కాదు. ప్రతిసారి ఆయన చేతుల్లో లేదన్నట్టు తేదీలు మారిపోతాయి. కానీ వారణాసి విషయంలో అలాంటి ఛాన్స్ ఇవ్వరట. తాజాగా సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి ఒక ప్రైవేట్ ఈవెంట్ లో బయట మాట్లాడిన మాటలు వింటే అభిమానుల సంతోషం రెట్టింపు కావడం ఖాయం.

దాని ప్రకారం వారణాసి పనులు కీరవాణి సెప్టెంబర్ నుంచి మొదలుపెట్టబోతున్నారు. రీ రికార్డింగ్ తో సహా అన్ని వర్క్స్ మొదలైపోతాయి. జనవరికంతా వాటిని ఫినిష్ చేసి రిలాక్స్ అయిపోతే అక్కడి నుంచి రాజమౌళి బృందం టేకోవర్ చేసుకుంటుంది. సంగీత పరంగా ఈసారి భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం పాటతో కాకుండా కంటెంట్ తో ఆస్కార్ తెచ్చుకోవాలని రాజమౌళి బలమైన సంకల్పం పెట్టుకున్నారు. దానికి తగ్గ ప్లానింగ్ జరుగుతోంది.

సో పెద్దాయన చెప్పేశారు కాబట్టి ఇంకెలాంటి అనుమానాలు పెట్టుకోనక్కర్లేదు. విఎఫెక్స్, పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం అవసరం కానుండటంతో షూటింగ్ మొత్తం అక్టోబర్ కల్లా పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నారు. ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ విజువల్ గ్రాండియర్ లో విలన్ కుంభగా పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఒకేసారి వారణాసి థియేటర్లలో రిలీజ్ చేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది దుర్గ ఆర్ట్స్ సంస్థ.