నిర్మాతగా కాజల్ అగర్వాల్… సినిమా ఎలా ఉంది

ఇప్పుడు హీరోయిన్ గా కనిపించడం తగ్గించేసింది కానీ టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన బ్లాక్ బస్టర్స్ లో నటించిన ట్రాక్ రికార్డు కాజల్ అగర్వాల్ సొంతం. భగవంత్ కేసరి తర్వాత బాలయ్య 111 కోసం ఏరికోరి ఆమెనే తీసుకుని ముఖ్యమైన పాత్రని ఆఫర్ చేశారు. అవకాశాలకు మరీ లోటు లేదు కానీ చెప్పుకోదగ్గ సక్సెస్ ఎక్కువగా పలకరించడం లేదు. తాజాగా తను ప్రధాన పాత్ర పోషించి నిర్మించిన ది ఇండియా స్టోరీ థియేటర్లలో అడుగు పెట్టింది. హిందీ వెర్షన్ ఒకటే రిలీజ్ చేశారు.

సీరియస్ కాన్సెప్ట్ తీసుకుని ఒక మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ ఇవ్వాలనే ఆలోచనతో కాజల్ అగర్వాల్ ఈ సినిమాకు అంతా తానై చూసుకుంది. బడ్జెట్ సుమారు ఇరవై కోట్ల దాకా అయ్యుంటుందని ముంబై టాక్. అయితే కలెక్షన్లు మాత్రం దానికి తగ్గట్టు లేవని ట్రేడ్ లో వినిపిస్తున్న మాట. మొదటి రోజు పట్టుమని పాతిక లక్షలు కూడా రాలేదని, కింది స్థాయి సెంటర్లలో కొన్ని చోట్ల అసలు షోలే పడనంత వీక్ గా ఆక్యుపెన్సీలు వచ్చాయని అంటున్నారు. ఇందులో ఏముందో చూద్దాం.

యోగేష్ అనే మేజర్ చిన్న కూతురు కలుషిత ఆహరం వల్ల క్యాన్సర్ బారిన పడి చనిపోతుంది. దీనికి కారణం విచ్చలవిడిగా క్రిమిసంహాకర మందులు వాడుతున్న కంపెనీలు, రైతులే భాద్యులని ఆరోపిస్తూ యోగేష్ కోర్టుకు వెళ్తాడు. అతనికి అండగా లాయర్ అర్చన, కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ విజయ్ రాథోడ్ ముందుకొస్తారు. అయితే న్యాయ స్థానంకు వెళ్ళాక అసలు సవాల్ మొదలవుతుంది. చివరికి వీళ్ళ కేసు ఏమయ్యిందనేది అసలు స్టోరీ.

చాలా కష్టమైన పాయింట్ తీసుకున్న దర్శకుడు చేతన్ డికె దాన్ని ఎంగేజింగ్ గా చెప్పడంలో తడబడటంతో చాలా చోట్ల సినిమా నత్తనడకన సాగుతుంది. గోపాల గోపాల తరహాలో కాకుండా ఒక సీరియస్ ఇష్యూని అంతే సీరియస్ గా చెప్పాలని చేసిన ప్రయత్నం ఆశించిన స్థాయిలో రాలేదు. కాజల్, శ్రేయాస్ తల్పాడే, మురళి శర్మ తదితర ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ బాగున్నప్పటికీ ఓవరాల్ గా కంటెంట్ అంతగా అనిపించదు. వీకెండ్ ఏమైనా పికప్ అయితే ఇండియా స్టోరీ నిలబడుతుంది.