శ్రీగౌరి నేర్చుకోవాల్సిన బేబీ పాఠాలు

మూడేళ్ళ క్రితం బేబీ విడుదలై బ్లాక్ బస్టర్ సాధించాక అందరి  అటెన్షన్ తీసుకున్న అమ్మాయి వైష్ణవి చైతన్య. అప్పటిదాకా చిన్న సపోర్టింగ్ రోల్స్ చేస్తూ యూట్యూబ్ పాపులారిటీకి పరిమితమైన ఈమెకు బేబీ ఇచ్చిన బ్రేక్ మామూలుది కాదు. కేవలం సక్సెస్ వరించడమే కాదు తన పెర్ఫార్మన్స్ గురించి పది మంది గొప్పగా మాట్లాడుకునేలా చేసింది. వైష్ణవి కాకుండా ఇంకెవరైనా కొత్తమ్మాయి చేసి ఉంటే బేబీ ఆ స్థాయిలో ఇంపాక్ట్ చూపించి ఉండేదా అంటే సమాధానం చెప్పడం కష్టం.

ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే అదే బ్యానర్ లో శ్రీగౌరి ప్రియా సక్సెస్ అందుకుంది. చెన్నై లవ్ స్టోరీలో భగ్న ప్రేమికురాలిగా, తాగుబోతుగా, ఆఫీస్ లో ఉద్యోగిగా, స్నేహితుల మధ్య ముక్కోపిగా ఇలా రకరకాల షేడ్స్ గొప్పగా పండించింది. కొన్ని చోట్ల కిరణ్ అబ్బవరంతో సహా ఆర్టిస్టులను సైడ్ చేసేంత స్థాయిలో డామినేషన్ చూపించింది. సక్సెస్ మీట్, థియేటర్ విజిట్స్ లో శ్రీగౌరి అంత ఎమోషనల్ కావడం వెనుక కారణం ఉంది. గతంలో ఇంత గుర్తింపు రాకపోవడమే.

అసలు విషయానికి వస్తే వైష్ణవి చైతన్య బేబీ తర్వాత పొరపాట్లు చేసింది. కేవలం అగ్ర నిర్మాత ఆఫర్ చేశారని లవ్ మీ ఇఫ్ యు డేర్ ఒప్పుకుంది. అదేమో దారుణంగా డిజాస్టర్ అయ్యింది. సబ్జెక్టు విన్నప్పుడే తన పాత్రకు అంత ప్రాధాన్యం లేదని గుర్తించి ఉంటే ఒక ఫ్లాప్ వచ్చేది కాదు. ఆ తర్వాత సిద్ధూ జొన్నలగడ్డతో జాక్ చేసింది. అది నేనేం తక్కువా అనే రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద తిరస్కారానికి గురయ్యింది. మూడు సంవత్సరాల్లో వైష్ణవి నటించింది రెండు సినిమాలే.

ఇప్పుడు ఆనంద్ దేవరకొండతో చేస్తున్న ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ విడుదలకు రెడీ అవుతోంది. శ్రీ గౌరీ ప్రియా ఇకపై ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం కాంబోల ఉచ్చులో పడినా అసలుకే మోసం వస్తుంది. సాయిపల్లవి లాగా గ్లామర్ కి దూరంగా ఉంటూ, నటననే నమ్ముకుంటే పెద్ద స్థాయికి వెళ్ళవచ్చు. అది కథల ఎంపికల మీద ఆధారపడి ఉంటుంది. మరి నివిగా చెన్నై లవ్ స్టోరీలో అదరగొట్టిన ఈ తెలుగు అమ్మాయి భవిష్యత్తుని ఎలా ప్లాన్ చేసుకుంటుందో వేచి చూడాలి.