అఖిల్ కొడుకుతో సిసింద్రీ-2

‘బాహుబలి’ ప్రభంజనం తర్వాత ఇండియన్ సినిమాలో సీక్వెల్స్, ఫ్రాంఛైజీ సినిమాల జోరు ఎంతగా పెరిగిందో తెలిసిందే. అవసరం ఉన్నా లేకపోయినా పార్ట్-2లు అనౌన్స్ చేసేస్తున్నారు. కానీ వాటిలో ఎక్కువ శాతం వర్కవుట్ కాలేదు. ప్రేక్షకుల్లో కూడా అన్ని సీక్వెల్స్ మీదా ఆసక్తి  కనిపించడం లేదు. కానీ కొన్ని సినిమాలకు సీక్వెల్ అనగానే ఎగ్జైట్మెంట్ కలుగుతుంది. ఇప్పుడు అలాంటి కబురే వినిపించాడు అఖిల్ అక్కినేని.

అతను చిన్న పిల్లాడిగా ఉండగా చేసిన ‘సిసింద్రీ’ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఈ చిత్రంతో అఖిల్ ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రజల్ని అమితంగా ఆకట్టుకుని చిన్నతనంలోనే స్టార్ ఇమేజ్ సంపాదించాడు. ఆ చిత్రానికి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉన్నట్లు అఖిల్ తాజాగా ఒక పాడ్ కాస్ట్‌లో వెల్లడించడం విశేషం.

తనకు గనుక కొడుకు పుడితే సిసింద్రీ-2 చేయాలని అనుకుంటున్నట్లు అఖిల్ తెలిపాడు. ఈ విషయాన్ని తన భార్య జైనాబ్‌కు కూడా చెప్పినట్లు అఖిల్ వెల్లడించాడు. తనకు కొడుకు పుడతాడా, కూతురు పుడుతుందా అన్నది దేవుడి చేతుల్లో ఉందని.. ఒకవేళ కొడుకు పుడితే మాత్రం తనను పెట్టి ‘సిసింద్రీ-2’ తీయాలన్నది తన ఆలోచన అని అఖిల్ తెలిపాడు.

తనకు అమ్మాయి పుడితే మాత్రం తండ్రిగా చాలా ప్రొటెక్టివ్‌గా ఉంటానని అతనన్నాడు. ‘సిసింద్రీ’ హాలీవుడ్ మూవీ ‘బేబీస్ డే ఔట్’ ఆధారంగా తెరకెక్కింది. ‘మనీ’ దర్శకుడు శివ నాగేశ్వరరావు రూపొందించిన ఈ చిత్రాన్ని నాగార్జున స్వయంగా నిర్మించడమే కాక ఇందులో ఒక కీలక పాత్ర చేశాడు. 

ఒక పెద్ద కుటుంబానికి చెందిన ఒక చిన్న పిల్లాడిని.. డబ్బుల కోసం తన బాబాయే కిడ్నాప్ చేయిస్తాడు. ఆ కిిడ్నాప్‌లో భాగమైన ముగ్గురు దొంగల్ని ఆ చిన్నపిల్లాడు ఎలా ముప్పుతిప్పలు పెట్టాడు.. అనూహ్య మలుపుల తర్వాత అతను తిరిగి తన తల్లిదండ్రుల్ని ఎలా చేరుకున్నాడు అన్నది ఈ చిత్ర కథ. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ సినిమాలో ఎంతో ముద్దుగా కనిపిస్తూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చిన అఖిల్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాడు. మరి అఖిల్‌కు కొడుకు పుట్టి అతను నవతరం సిసింద్రీ ప్రేక్షకులను తండ్రిలాగే మెప్పిస్తాడేమో చూడాలి.