శాటిలైట్ సినిమాలకు అంత సీన్ ఉందా

శాటిలైట్ మార్కెట్ మునుపటిలా లేదు. జూనియర్ ఎన్టీఆర్ దేవరకు ఇప్పటిదాకా ఈ విభాగం హక్కులు అమ్ముడుపోలేదు. ఆ మధ్య ఈటీవీ కొనుక్కుందని తెగ ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయ్యింది. ఈటీవీ ప్రాధమికంగా సీరియల్స్, రియాలిటీ షోలు, న్యూస్ మీద పాపులారిటీ తెచ్చుకున్న ఛానల్ కాబట్టి, అందులో పెద్ద సినిమా రావడం ఏమిటనే కోణంలో కొందరు కామెంట్లు చేశారు. కట్ చేస్తే దేవర ఏమో కానీ పవన్ కళ్యాణ్ ఓజి మాత్రం ఇదే ఛానల్ లో త్వరలో టెలికాస్ట్ కానుంది.

ఎంతకు కొన్నారు ఎంత వచ్చిందనే దాని కన్నా అసలు శాటిలైట్ లో వచ్చే సినిమాలకు నిజంగా అంత సీన్ ఉందా అంటే సమాధానం ఔనని చెప్పలేం. ఎందుకంటే ఓటిటిలు బాగా విస్తరించిపోయాక వాటికి అలవాటు పడిన జనాలు డిస్క్ కనెక్షన్లు తీయించుకుని బ్రాడ్ బ్యాండ్ ఇంటర్ నెట్ సహాయంతో ఓటిటి చందాలు తీసుకున్నారు. అయితే అధిక శాతం మధ్య తరగతి ఇళ్లలో ఇప్పటికీ కేబుల్ టీవీ ప్రసారాలు మూలాధారం. కొత్త సినిమాలను వాటిలో చూసే సంఖ్య పెద్దదే.

కానీ ఇంతకు ముందులాగా భారీ స్థాయిలో లేదన్నది కూడా వాస్తవం. ఎందుకంటే ఎప్పుడో రెండు మూడు నెలల తర్వాత ఛానల్ లో వచ్చే కొత్త సినిమా కోసం ఎదురు చూసేంత ఓపిక జనాల్లో ఉండటం లేదు. ఓటిటికి కట్టేందుకు డబ్బులు లేవనుకుంటే ఆన్ లైన్ లో డౌన్లోడ్ చేసుకుని చూసేస్తున్నారు. టీవీలో యాడ్స్ భరిస్తూ గంటల తరబడి కూచునే ఓపిక జెన్ జీలో లేదు. పెద్ద వాళ్ళు, పెద్ద టీవీ కొనే స్థోమత లేని వాళ్లు ఇప్పటికీ శాటిలైట్ ఛానల్స్ వినోదం మీదే ఆధారపడుతున్నారు.

ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ సినిమా అయినా ఎవరికి అమ్మారు అనే దాని కన్నా థియేటర్లలో ఎంత కలెక్షన్ వచ్చింది, ఓటిటిలో ఎన్ని మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి, వరల్డ్ వైడ్ ఏ పొజిషన్ లో ట్రెండ్ అవుతోందనే దాని మీదే అభిమానులు ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కాబట్టి ఏ ఛానల్ లో వచ్చినా పెద్దగా తేడా ఉండదని ఫీలయ్యే రోజుల్లోకి వచ్చేశాం. ఈ వాస్తవాన్ని గుర్తిస్తే  ఫాన్స్ రిలాక్స్ అయిపోవచ్చు. నెట్ ఫ్లిక్స్ లో సందడి చేసిన ఓజి త్వరలోనే ఈటీవీలో దర్శనమివ్వనుంది.