‘కేజీఎఫ్-2’ టీజర్ ప్రపంచ రికార్డు


‘కేజీఎఫ్’ టీం ఇచ్చిన సడెన్ సర్ప్రైజ్ సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది. శుక్రవారం యశ్ పుట్టిన రోజు సందర్భంగా ఒక ముహూర్తం పెట్టి టీజర్ రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సిద్ధపడగా.. ఆలోపే టీజర్ లీక్ కావడంతో అనుకున్న దానికంటే 12 గంటల ముందే టీజర్‌‌ను వదిలేశారు. ఇలా అనుకోకుండా టీజర్ వచ్చినా సరే.. అది సోషల్ మీడియాను షేక్ చేసేసింది. టీజర్ రిలీజైన 12 గంటల్లోనే వివిధ భాషల్లో కలిపి 25 మిలియన్ల (2.5 కోట్లు) వ్యూస్ మార్కును దాటేయడం విశేషం.

శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి యూట్యూబ్‌లో ‘కేజీఎఫ్-2’ టీజర్ అన్ని భాషల్లో కలిపి 3 కోట్లకు పైగా వ్యూస్ తెచ్చుకోవడం విశేషం. ఇక ఈ టీజర్ లైక్స్ విషయంలో ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెళ్తోంది. అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్స్, 2 మిలియన్ లైక్స్ సంపాదించిన టీజర్‌గా ఇది ప్రపంచ రికార్డులు నెలకొల్పింది.

రెండేళ్ల కిందట కన్నడలో భారీ అంచనాలతో, ఇతర భాషల్లో పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ‘కేజీఎఫ్’ అన్ని భాషల్లోనూ సంచలన విజయం సాధించింది. ఓ కన్నడ సినిమా కర్ణాటక అవతల విడుదల కావడమే గగనం అనుకుంటే.. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో అసాధారణ వసూళ్లతో ట్రేడ్ పండిట్లను విస్మయానికి గురి చేసింది.

ముందు ఈ సినిమాను లైట్ తీసుకున్న వాళ్లు కూడా ఏంటి దీని ప్రత్యేకత అని ఆసక్తిగా సినిమా చూడటం మొదలుపెట్టారు. థియేటర్లలోనే కాక.. అమేజాన్ ప్రైమ్‌లోనూ వివిధ భాషల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విరగబడి చూశారు. ఇక అప్పట్నుంచి ‘కేజీఎఫ్-2’ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వారిలో ఈ సినిమాపై ఆసక్తి ఏ స్థాయిలో ఉందనడానికి టీజర్‌కు వస్తున్న రెస్పాన్సే నిదర్శనం. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా సినిమా ఉంటుందనే సంకేతాలను టీజర్ ఇచ్చింది.