జానీ మాస్టర్‌ పై సంచలన నిర్ణయం

స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ పై తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కఠిన చర్యలకు సిద్ధమైంది. ఆయనకు సహాయ నిరాకరణను ప్రకటించింది. దేశవ్యాప్తంగా జానీ ఏ సినిమా చేసినా.. 23 క్రాఫ్ట్స్ నుంచి సహకారం అందించవని ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని నిర్మాతలకు కూడా తెలియజేయనున్నట్లు సమాఖ్య ప్రకటించింది. తన భార్య సుమలత పదవిని అడ్డుపెట్టుకుని జానీ మాస్టర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని జానీ మాస్టర్ మీద ఫెడరేషన్ మండిపడింది.

ఈ నెల 12న ఫెడరేషన్ నాయకత్వంపై జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన సమాఖ్య.. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగేలా అతను మాట్లాడాడని, ఈ చర్యలకు వివరణ ఇవ్వాలని కోరినా, 14న విచారణకు పిలిచినా జానీ హాజరు కాలేదని పేర్కొంది. దీనికి సంబంధించి ఏడు రోజుల్లోగా లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని.. తన చర్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేని పక్షంలో శాశ్వత బహిష్కరణ వేటు వేసేలా క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేసింది.

తెలుగు డ్యాన్సర్స్ అసోసియేషన్లో కొందరు నకిలీ బిల్లులతో నిర్మాతలను మోసం చేస్తున్నట్లు గుర్తించి, వారిపై చర్యలు ప్రారంభించినందుకే తనపై కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించిన సుమలత.. ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ మీదా పలు ఆరోపణలు చేశారు. సమాఖ్య పెద్దలు అవినీతిపరులకే మద్దలు పలుకుతున్నారని.. తమపై అణచివేతకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భార్యతో కలిసి జానీ మాస్టర్.. ఫెడరేషన్ మీద పలు విమర్శలు, ఆరోపణలు చేయడంతో సమాఖ్య ఇప్పుడీ సహాయ నిరాకరణ నిర్ణయం తీసుకుంది. దీనిపై జానీ ఏమంటాడో చూడాలి మరి.