అంచనాల ఒత్తిడిని ‘రామాయణ’ తట్టుకుంటుందా

ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల కోట్లకు పైమాటే. ఇప్పటిదాకా ఏ ఇండియన్ సినిమాకు అంత మొత్తంలో బడ్జెట్ పెట్టలేదు. అందుకే ఒక ఇంటర్వ్యూలో ఆయన ఆ మాట అన్నప్పటి నుంచి అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. కానీ ఊహించని విధంగా టీజర్ కి నెగటివ్ రియాక్షన్లు ఎక్కువ రావడం రామాయణ టీమ్ ఊహించలేదు. విఎఫ్ఎక్స్ మీద ఎక్కువ కంప్లయింట్స్ వచ్చాయి.

ఇప్పుడు అవన్నీ ఈ నెల 24 విడుదల కాబోయే ట్రైలర్ రూపంలో సమాధానం దక్కించుకోవాలి. ఒకరకంగా చెప్పాలంటే రామాయణ మీద తీవ్ర ఒత్తిడి ఉంది. అయిదు వందల కోట్ల థియేటర్ డీల్ వస్తుందనుకుంటే అందులో సగమే అయ్యిందనేది ముంబై టాక్. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్లను ఆకట్టుకోవాలంటే కంటెంట్, విజువల్స్ చాలా ముఖ్యం. ఇక్కడ కీలక పాత్ర పోషించేది ముమ్మాటికీ ట్రైలరే. అందుకే ఇంత ప్రెజర్.

గమనించాల్సిన కోణం మరొకటి ఉంది. వారణాసి టైటిల్ టీజర్ వచ్చినప్పుడు ఎక్కడా నెగటివిటీ రాకుండా రాజమౌళి గొప్ప పనితనం చూపించారు. మహేష్ బాబు తప్ప మిగిలిన విజువల్స్ ఒరిజినల్ కాకపోయినా కాన్సెప్ట్ అర్థమయ్యేలా చేసి ఎగ్జైట్ మెంట్ కలిగించడంలో సక్సెస్ అయ్యారు. కానీ రామాయణకు అలాంటి అడ్వాంటేజ్ దక్కలేదు. అందులోనూ అందరికీ తెలిసిన, కొన్ని వందల వేలసార్లు చూసిన కథ కావడంతో ఇప్పటికైతే ఉత్సుకత శాతం తక్కువగానే ఉంది.

దీపావళి విడుదలకు రెడీ అవుతున్న రామాయణ డేట్ ట్రైలర్ లోనే రివీల్ చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటిదాకా ఎవరూ చేయనంత గ్రాండ్ గా ఈ లాంచ్ ఉంటుందని అంటున్నారు. 3డి టెక్నాలజీలో రూపొందిన రామాయణలో రన్బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా నటిస్తుండగా యష్ రావణుడిగా చేయడం అంచనాలు పెంచుతోంది. సన్నీడియోల్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ ఇతర తారాగణం.