అప్పట్లో యువతను ఉర్రూతలూగించిన హ్యాపీడేస్ సినిమాలో టైసన్ పాత్రతో రాహుల్ అనే కొత్త కుర్రాడు ఎంతగా ఆకట్టుకున్నాడో తెలిసిందే. హీరో వరుణ్ సందేశ్ పాత్రను మించి ఈ క్యారెక్టర్ అందులో హైలైట్ అయింది. ఐతే ఈ సినిమాతో వచ్చిన గుర్తింపును రాహుల్ సరిగా ఉపయోగించుకోలేకపోయాడు.
హ్యాపీడేస్ తర్వాత వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో చేసిన రెయిన్ బో బోల్తా కొట్టడంతో అతడి కెరీర్‌కు బ్రేక్ పడింది. ఆపై కొంచెం గ్యాప్ తీసుకుని ప్రేమ ఒక మైకం అనే సినిమా చేశాడు. అదీ ఆడలేదు. ఆ తర్వాత చాలా విరామం తీసుకుని చేసిన వెంకటాపురం అనే క్రైమ్ మూవీ కూడా తుస్సుమనిపించింది. దీంతో రాహుల్ సినిమాలకు సెలవిచ్చేసినట్లే అని అంతా అనుకున్నారు.
కానీ రాహుల్ తన పోరాటాన్ని ఇంకా ఆపలేదు. మరోసారి గ్యాప్ తీసుకుని కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ఆ సినిమా పేరు.. 100 క్రోర్స్. టైటిల్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్‌గానే కనిపిస్తోంది. బహుశా ఇది డబ్బుతో ముడిపడ్డ క్రైమ్ థ్రిల్లర్ కావచ్చేమో. విరాట్ చక్రవర్తి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. ఎస్ఎస్ స్టూడియోస్ బేనర్ మీద నాగం తిరుపతి రెడ్డి అనే నిర్మాత ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సాక్షి చౌదరి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.
ఒకప్పుడు మీడియం రేంజ్ సినిమాల్లో హవా సాగించి, ఆ తర్వాత సైడ్ అయిపోయిన సాయికార్తీక్ 100 క్రోర్స్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మరి చాలా గ్యాప్ తీసుకుని, ఎంతో కసరత్తు చేసి ఈ సినిమా చేస్తున్న రాహుల్‌కు ఈసారైనా సానుకూల ఫలితం అందుతుందేమో చూడాలి.