పైకి ఏదో టాలీవుడ్ వెలిగిపోతోందని అనుకోవడమే కానీ ఇండస్ట్రీ డొల్లతనాలు, నిర్మాతల కష్టనష్టాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా కరోనా తర్వాత ఊహించలేని స్థాయిలో పరిస్థితి మారిపోయింది. ఆ టైంలో ఓటిటి హక్కులు ఎగబడి కొన్న కంపెనీలు ఇప్పుడు ఏకంగా ప్యాన్ ఇండియా థియేటర్ రిలీజులను శాశించే స్థాయికి చేరుకున్నాయి. ఈ కారణంగానే రైట్స్ అమ్ముడుపోక విడుదల తేదీలు ప్రకటించలేని దుస్థితి ప్రొడ్యూసర్లు చవి చూస్తున్నారు. దీని గురించి గళం విప్పిన వాళ్ళు తక్కువ.
తాజాగా జరిగిన వదలా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆవేదన వ్యక్తం చేశారు. తన యాభై సంవత్సరాల అనుభవంలో ఒకప్పుడు ప్రేక్షకుల కోసం సినిమాలు తీసేవాళ్లమని, కానీ ఇప్పుడు ఎవరి కోసం తీస్తున్నామో అర్థం కావడం లేదని అన్నారు. ఓటిటి నచ్చలేదని, హిందీ ఆడియన్స్ కి అర్థం కాదని, శాటిలైట్ వాళ్ళు ఇలా ఉంటే ఒప్పుకోరని ఇలా రకరకాల కారణాలతో ఒక్కో సినిమా మూడు నాలుగు సంవత్సరాలు తీయడం పట్ల విచారం ప్రకటించారు.
ఆయన అన్నది అక్షరాలా నిజం. ఒకప్పుడు కృష్ణ చిరంజీవి లాంటి హీరోలు ఏడాదిక్లి పది నుంచి పదిహేను సినిమాలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు టైర్ 1 స్టార్లు రెండు సంవత్సరాలకు ఒకటి చేయడం గగనమైపోయింది. ఏదైనా అంటే క్వాలిటీ కోసమని సర్దిచెబుతారు. తీరా చూస్తే బాక్సాఫిస్ దగ్గర సక్సెస్ అయ్యేవి వేళ్ళ మీద లెక్క బెట్టొచ్చు. పోనీ హిట్ అయినవి అన్ని చోట్ల ఒకే ఫలితం అందుకుంటున్నాయా అంటే అదీ లేదు. ఇక్కడ హిట్ అయినా ఓవర్సీస్ లో వర్కౌట్ అవుతుందన్న గ్యారెంటీ లేదు.
ఇదంతా ఎవరికి వారు అంతర్మథనం చేసుకుంటే తప్ప పరిష్కారం దొరకని సమస్య. వరల్డ్ బిల్డింగ్ పేరుతో పాతిక కోట్ల మార్కెట్ లేని హీరోలు కూడా ఒక్కో ప్రాజెక్టుకి మూడేళ్ళ దాకా ఖర్చు చేస్తున్నారు. ఇంతా చేస్తే మొదటి రోజు నాలుగు షోలు హౌస్ ఫుల్ పడతాయన్న గ్యారెంటీ లేదు. ఎంతసేపూ బిజినెస్ కోణంలోనే చూడటమే తప్ప జనాల అభిరుచికి తగ్గట్టు ఏం ఇవ్వాలో మర్చిపోతున్నారు. టాలీవుడ్ లోనే కాదు అన్ని భాషల్లోనూ సక్సెస్ రేట్ అంతకంత తగ్గిపోవడానికి కారణం ఇదే.
Gulte Telugu Telugu Political and Movie News Updates