తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు రాజకీయాల వైపు మళ్లింది. ఆ టైంలో సినిమాలకు కూడా దూరం అయిపోయాడు. కానీ చివరికి రాజకీయాలూ వదిలేసి, సినిమాలూ మానేసి పూర్తిగా ఫేడవుట్ అయిపోయాడు. ఇక మళ్లీ అతణ్ని తెర మీద చూడడం సందేహమే అనుకుంటే.. అనుకోకుండా బిగ్ బాస్ షోలోకి రావడం, మళ్లీ జనాల దృష్టిలో పడి సినిమా అవకాశాలు అందుకోవడం.. రీఎంట్రీలో ఫస్ట్ ఛాన్స్ ‘కోర్ట్’ను రెండు చేతులా అందిపుచ్చుకోవడంతో శివాజీ పేరు ఇండస్ట్రీలో మార్మోగింది.

ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కూడా రానంత క్రేజ్‌ను ‘కోర్ట్’ మూవీతో సంపాదించాడు శివాజీ. ఆపై ‘దండోరా’ చిత్రంతోనూ శివాజీ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. హీరోగా నటించిన ‘సంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని’ ఆశించిన ఫలితాన్నివ్వకపోయినా శివాజీ కెరీర్‌కేమీ ఢోకా లేదు. ఈ వారం రిలీజ్ కానున్న క్రేజీ మూవీ ‘లెనిన్’లోనూ ఆయన కీలక పాత్ర పోషించాడు. ఇంతలో శివాజీకి ఒక మంచి ప్రాజెక్టులో అవకాశం దక్కింది.

లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ చిత్రాలతో తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించిన నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా మారి తీస్తున్న కొత్త సినిమాలో శివాజీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ రోజే ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వీడియో వచ్చింది. దాన్ని వేరే లెవెల్లో తీర్చిదిద్దింది టీం. ఆరుగురు కుర్రాళ్లు కలిసి ‘పీఆర్ ఆల్ఫా యూనిట్’ పేరుతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో మామిత బైజు లీడ్ రోల్ చేస్తోంది.

‘డ్రాగన్’ దర్శకుడు అశ్వత్ మారిముత్తు కూడా ఇందులో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుండగా.. మరో ముఖ్య పాత్రధారిగా శివాజీని పరిచయం చేశారు. అనౌన్స్‌మెంట్ వీడియోలో శివాజీని భాగం చేశారంటే ఆయనకు ఇస్తున్న ప్రాధాన్యమేంటో అర్థమవుతుంది. ‘కోర్ట్’, ‘దండోరా’ చిత్రాలతో ఇతర భాషల్లోనూ శివాజీకి మంచి గుర్తింపు వచ్చింది. ఆయనలో మంచి పెర్ఫామర్ ఉన్న సంగతి గుర్తించే ప్రదీప్ స్వయంగా ఈ పాత్రకు ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ చిత్రానికి కథ అందించింది కూడా అతనే. ఈ సినిమాలో శివాజీ తనదైన ముద్ర వేయగలిగాడంటే తమిళంలోనూ ఆయన బిజీ అయిపోతాడేమో. కెరీర్లో ఈ దశలో ఇలాంటి రైజ్ ఆశ్చర్యం కలిగించేదే.