నాగార్జున నోట‌… చింటు మాట‌

టాలీవుడ్ నిర్మాతల్లో సూర్య‌దేవ‌ర నాగ‌వంశీకి సోష‌ల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంత‌మంది అత‌ణ్ని అభిమానిస్తే.. కొంత‌మంది త‌న‌ను అదే ప‌నిగా ట్రోల్ చేస్తుంటారు. ఇటు అభిమానులు, అటు వ్య‌తిరేకులు.. నాగ‌వంశీని చింటు అని స‌ర‌దాగా పిలుస్తుంటారు. ఈ విష‌యం ఇండ‌స్ట్రీ జనాల‌కు కూడా బాగా తెలుసు. త‌న‌ను చింటు పేరుతో చాలామంది ట్రోల్ చేస్తుంటార‌ని తెలిసినా.. నాగ‌వంశీ ఆ విష‌యాన్ని సీరియ‌స్‌గా ఏమీ తీసుకోడు.

మాస్ జాత‌ర ఈవెంట్లో, ప్ర‌మోష‌న‌ల్ ఇంట‌ర్వ్యూల్లో మాస్ రాజా ర‌వితేజ ప‌దే ప‌దే నాగ‌వంశీని.. చింటు చింటు అంటూ ఆట‌ప‌ట్టించ‌డం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు సీనియ‌ర్ హీరో అక్కినేని నాగార్జున సైతం స్టేజ్ మీద నాగ‌వంశీని చింటు చింటూ అంటూ స‌ర‌దాగా కామెంట్ చేయ‌డం విశేషం. నాగ్, నాగ‌వంశీ క‌లిసి అక్కినేని అఖిల్‌ను హీరోగా పెట్టి లెనిన్ మూవీని నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఆదివారం తిరుప‌తిలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా నాగ్.. నాగ‌వంశీని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.

నాకో పార్ట్‌న‌ర్ ఉన్నాడు.. మీరంతా చింటు అన్న అని పిలుస్తారట క‌దా అత‌ణ్ని.. అంటూ నాగ్ కామెంట్ చేయ‌డంతో ఆడిటోరియం హోరెత్తింది. ఈ కామెంట్ విని నాగ‌వంశీ కూడా న‌వ్వేశాడు. త‌ర్వాత నాగ్ ప్ర‌సంగాన్ని కొన‌సాగిస్తూ.. లెనిన్ సినిమా విష‌యంలో అఖిల్‌కు, త‌న‌కు ఏ ఇబ్బంది రాకుండా నాగ‌వంశీ అన్నీ స‌మ‌కూర్చి పెట్టాడ‌ని, ఈ సినిమాను ప‌క‌డ్బందీగా తెర‌కెక్కేలా చూశాడ‌ని అన్నాడు.

చింటు అన్న‌కు మాస్ ప‌ల్స్ బాగా తెలుస‌ని.. అత‌ను ఈ సినిమా మీద ఎంతో న‌మ్మ‌కంతో ఏపీ అంత‌టా లెనిన్‌ను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడ‌ని, దీన్ని బ‌ట్టి ఈ సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చ‌ని నాగ్ అన్నాడు. లెనిన్ క‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌న్న ధీమాను నాగ్ వ్య‌క్తం చేశాడు. విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ ఫేమ్ ముర‌ళీ కృష్ణ రూపొందించిన లెనిన్ రాబోయే శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకురానుంది. భాగ్య‌శ్రీ బోర్సే క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందించాడు.