దక్షిణాది సినీ పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో మాధవన్ ఒకరు. మణిరత్నం లాంటి మేటి దర్శకుడితో చేసిన ‘సఖి’ లాంటి క్లాసిక్ ద్వారా హీరోగా పరిచయమైన ఈ టాలెంటెడ్ నటుడు.. ఇంతింతై అన్నట్లు ఎదిగాడు. బాలీవుడ్ సినిమాల్లోనూ సత్తా చాటుకుని దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించాడు. ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో ‘రాకెట్రీ’ అనే వినూత్న చిత్రం చేస్తున్నాడు మాధవన్. ఈ సినిమా కోసం అతను అవతారం మార్చుకున్నాడు. ఈ సినిమా అనే కాదు.. కొన్నేళ్లుగా మాధవన్ లుక్ భిన్నంగా ఉంటోంది.
ఇంతకుముందు చాక్లెట్ బాయ్‌లా కనిపించిన మాధవన్.. పాత్రలకు అనుగుణంగా తన అవతారాన్ని మార్చుకుని రఫ్ లుక్‌లోకి మారాడు. ఐతే ఈ లుక్ చూసి ఒక వైద్యురాలు ట్విట్టర్లో చేసిన ఆరోపణలు వివాదాస్పదం అయ్యాయి. మాధవన్ డ్రగ్స్‌కు బానిసైపోయాడంటూ ఆ వైద్యురాలు ఆరోపించడం గమనార్హం. ఈ ఆరోపణలపై మాధవన్ తీవ్రంగా స్పందించాడు కూడా.
తాను మాధవన్‌కు అభిమానినని.. కానీ అతను ప్రస్తుతం డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడని, మద్యానికి బానిసయ్యాడని.. దీని వల్ల కెరీర్‌తో పాటు ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నాడని ఆ వైద్యురాలు ఆరోపించింది. మాధవన్ బాలీవుడ్లోకి అడుగు పెట్టినపుడు ఎలా ఉన్నాడో.. ఇప్పుడెలా ఉన్నాడో.. ఒకసారి అతడి ముఖం చూస్తేనే విషయం అర్థమవుతుందని ఆమె పేర్కొంది.
వెంటనే మాధవన్ అభిమానులు లైన్లోకి వచ్చి ఆ వైద్యురాలిని తిట్టిపోయగా.. మాధవన్ సైతం ఈ ట్వీట్‌పై స్పందించాడు. ‘‘ఓహ్.. మీరు రోగ నిర్ధారణ చేసేది ఇలాగన్నమాట. పాపం మీ పేషెంట్లను చూస్తుంటే నాకు జాలేస్తోంది. నువ్వు వీలైనంత త్వరగా డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకోవడం మంచిది’’ అని వ్యాఖ్యానించాడు. నేరుగా మాధవనే స్పందించడం, అతడి అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో సదరు వైద్యురాలు ఈ ట్వీట్‌ను డెలీట్ చేసి సైలెంట్ అయిపోయింది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. ‘రాకెట్రీ’ కంటే ముందు మాధవన్ నుంచి ‘మారా’ అనే సినిమా రాబోతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates