సంక్రాంతి సినిమాల‌కు బంప‌రాఫ‌ర్?


50 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు న‌డుస్తున్న‌ప్ప‌టికీ ధైర్యం చేసి కొత్త సినిమాల‌ను విడుద‌ల చేసేస్తున్నారు. క్రిస్మ‌స్‌కు రిలీజ్ చేసిన‌ సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ చిత్రానికి మంచి స్పంద‌న రావ‌డంతో సంక్రాంతికి ఒకేసారి నాలుగు చిత్రాలు విడుద‌ల‌వుతున్నాయి. కానీ అస‌లే పోటీ ఎక్కువ‌, పైగా స‌గం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు న‌డుస్తున్న నేప‌థ్యంలో రెవెన్యూ ఏమాత్రం వ‌స్తుందో అన్న భ‌యం ఉంది. ఇంత పోటీ ఉండాల్సింది కాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఐతే సంక్రాంతి సినిమాల‌కు అనుకోని వ‌రం ద‌క్కేలా ఉంద‌న్న‌ది ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల మాట‌. త‌మిళ‌నాట 100 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు న‌డ‌ప‌డానికి రెండు రోజుల కింద‌టే అనుమ‌తులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో టాలీవుడ్లోనూ ఆశ‌లు రేగాయి.

ఇక్క‌డి సినీ పెద్ద‌లు ఆల‌స్యం చేయ‌కుండా ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో మాట్లాడుతున్న‌ట్లు తెలుస్తోంది. నిర్మాత‌ల మండ‌లి త‌ర‌ఫున అధికారికంగా ప్ర‌భుత్వానికి విన్న‌పం కూడా పంపించేశారు. మ‌రోవైపు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 100 శాతం ఆక్యుపెన్సీ కోసం విజ్ఞ‌ప్తులు వెళ్తున్నాయి. బెంగాల్‌లోనూ ఈ దిశ‌గా అనుమ‌తులు ల‌భించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కేసీఆర్, జ‌గ‌న్ కూడా సినీ ప‌రిశ్ర‌మ‌కు వ‌రం ఇవ్వ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు.

తెలుగు సినిమాల‌కు సంబంధించి సంక్రాంతి అతి పెద్ద సీజ‌న్ అన్న సంగ‌తి తెలిసిందే. కాబ‌ట్టి ఇప్పుడే 100 శాతం ఆక్యుపెన్సీకి ఛాన్స్ ఇస్తే.. పండ‌క్కి పోటీలో ఉన్న చిత్రాల‌కు ఎంతో ల‌బ్ది చేకూరిన‌ట్ల‌వుతుంది. ఈ నెల 9న క్రాక్ రిలీజ‌వుతున్న నేప‌థ్యంలో నిర్ణ‌యంతీసుకుంటే రాబోయే రెండు మూడు రోజుల్లోనే తీసుకోవ‌చ్చ‌ని అంటున్నారు. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో?