పెద్ది థియేటర్ రన్ దాదాపుగా ముగిసింది. నెలల రోజులు పూర్తి కావడంతో చాలా సెంటర్లలో నామ మాత్రపు వసూళ్లు వస్తున్నాయి. ముఖ్యంగా మా ఇంటి బంగారం వచ్చాక పెద్ది వెనుకడుగు తీసుకోక తప్పలేదు. ఓటిటి స్ట్రీమింగ్ ఇంకా టైం ఉన్నప్పటికీ థియేటర్ లో చూడాలనుకున్న జనాలు ఆల్మోస్ట్ షోలు పూర్తి చేశారు. కొత్త సీన్లు జోడించాక అభిమానుల్లో పెద్దగా ఎగ్జైట్ మెంట్ కలగలేదు. వాటి కోసమే మళ్ళీ టికెట్లు కొన్నవాళ్ళు తక్కువేనని సోషల్ మీడియా ట్రెండ్స్ స్పష్టం చేశాయి.
దీని తర్వాత ఒక రెండు మూడు నెలలు గ్యాప్ తీసుకుని రామ్ చరణ్ ఆర్సి 17 మొదలుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందబోయే ఈ యాక్షన్ డ్రామా చాలా భారీ ఎత్తున తెరకెక్కించబోతున్నారు. మైత్రి ఓన్ ప్రొడక్షన్ కాబట్టి బడ్జెట్ లెక్కలు గట్రా ఉండవు. ఎంతైనా ఖర్చు పెట్టేస్తారు. దీని తర్వాత ఆర్సి 18 ఎవరితో ఉంటుందనే దాని మీద రకరకాల ప్రచారాలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో బుచ్చిబాబు కాంబో కూడా ఉంది.
అంతర్గత సమాచారం ప్రకారం రామ్ చరణ్ తన 18వ సినిమాకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బుచ్చిబాబు టేకింగ్, కథ చెప్పే విధానం విపరీతంగా నచ్చినప్పటికీ తక్కువ గ్యాప్ లో మరొకటి చేయాలనే తొందరలో అయితే లేడట. ఈసారి సందేశాల జోలికి వెళ్లనని ఆల్రెడీ చెప్పిన బుచ్చిబాబు దానికి తగ్గట్టే తన టీమ్ తో కలిసి కమర్షియల్ సబ్జెక్టు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. అందులో రామ్ చరణ్ హీరోగా చేస్తారా లేక ఇంకెవరైనా వస్తారానేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు.
ముందైతే చరణ్ దృష్టి సుకుమార్ ప్రాజెక్టు మీద ఉంది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ది పెర్ఫార్మన్స్ వీక్ గా ఉండటం తనను ఖచ్చితంగా నిరాశ పరిచింది. అది మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే సుక్కు మార్క్ ట్రీట్ మెంట్ మరోసారి కుదరాలి. రంగస్థలం తరహాలో బాక్సాఫీస్ ని ఊపేసే కంటెంట్ రావాలి. దానికి అనుగుణంగానే స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయట. ఫైనల్ నెరేషన్ ఇంకో నెల రోజుల్లో ఉందట. అది అయ్యాక షూటింగ్ డేట్స్, కాల్ షీట్స్ అన్నీ సెట్ చేయబోతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates