ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే అవకాశం ఉన్న పాత సినిమాలను మళ్లీ థియేటర్లకు వెళ్లి చూసేందుకు మన ప్రేక్షకులు ఎగబడే తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. కొన్నేళ్ల నుంచి ఈ రీ రిలీజ్ ట్రెండు మంచి జోరు మీద నడుస్తోంది. కొత్త సినిమా రిలీజవుతున్నట్లు పొద్దు పొద్దున్నే పాత సినిమాల షోలకు వెళ్లి మన కుర్రాళ్లు చేసే సందడి అంతా ఇంతా కాదు.
ఐతే ఇలా ఎక్కువగా పెద్ద హీరోల సినిమాల విషయంలోనే జరుగుతుంటుంది. ఫ్యాన్ మూమెంట్స్ ఉండే మాస్ సినిమాలకు వెళ్లి థియేటర్లలో హంగామా చేయడాన్ని అభిమానులు ఆస్వాదిస్తుంటారు. ఐతే అప్పుడప్పుడూ గతంలో డిజాస్టర్లు అయిన, మాస్ మూమెంట్స్ లేని సినిమాలు కూడా రీ రిలీజై ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంటాయి. 3 లాంటి చిత్రాలు అందుకు ఉదాహరణ.
ఐతే ఇప్పుడు ఎవ్వరూ ఊహించని విధంగా ఆరుగురు పతివ్రతలు అనే పాత లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా రీ రిలీజ్‌కు రెడీ అయిపోయింది. ఇందులో ఏ స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ ఉండరు. అందరూ చాలా వరకు కొత్త నటీనటులే. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన లెజెండరీ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చాలా ఏళ్ల కిందటే కాలం చేశారు. సంచలన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో తీవ్ర వివాదానికి దారి తీసింది.
ఈ టైటిల్, ఇందులో చూపించిన సన్నివేశాల విషయంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అప్పట్లో మహిళా సంఘాలు నిరసన ప్రదర్శనలు కూడా చేశాయి. ఆ వివాదాలను దాటుకుని ఈచిత్రం విజయవంతమైంది.
సోషల్ మీడియాలో తరచుగా ఇందులో సన్నివేశాల గురించి చర్చ జరుగుతుంటుంది. వీడియోలు తిరుగుతూ ఉంటాయి. మీమ్స్‌లో కూడా ఇందులోని సన్నివేశాలు, పాత్రలను వాడుతుంటారు. ఇది చూసే ఆరుగురు పతివ్రతలు చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నట్లు ఉన్నారు. మరి సోషల్ మీడియలో ఈ సినిమాను సెలబ్రేట్ చేసే జనాలు.. థియేటర్లకు వచ్చి ఆదరిస్తారా అన్నది ఆసక్తికరం. ఆరుగురు పతివ్రతలు రీ రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించబోతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates