తారక్ & త్రివిక్రమ్… యుద్ధం మొదలుకానుంది

అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. వాళ్ళ నిరీక్షణ ఫలించింది. ఈ ప్యాన్ ఇండియా మూవీని అధికారికంగా ప్రకటించేశారు. ఆదర్శ కుటుంబం షూటింగ్ దాదాపు పూర్తయిన సందర్భంలో ఈ అనౌన్స్ మెంట్ రావడం గమనార్హం. ప్రస్తుతం డ్రాగన్ లో బిజీగా ఉన్న తారక్ అది పూర్తి చేసుకుని వచ్చాక మాటల మాంత్రికుడి సెట్స్ లో అడుగు పెట్టబోతున్నారు.

కాన్సెప్ట్ పోస్టర్ లో ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వలేదు కానీ ముందు నుంచి ప్రచారం జరిగినట్టు ‘గాడ్ అఫ్ వార్’ థీమ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. త్రిశూలం, దాని ముందు కుమారస్వామి ఆయుధం, కుడి ఎడమల వైపు గుళ్ళు గోపురాలతో పాటు యుద్ధం జరిగిన అంశాలను పొందుపరచడం ద్వారా ఒక సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్న క్లూ అయితే ఇచ్చారు. ముందు అల్లు అర్జున్ తో అనుకున్న ఈ ప్రాజెక్ట్ తర్వాత తారక్ కు వచ్చిన సంగతి తెలిసిందే.

కాకపోతే విడుదల ఎప్పుడనేది అంత ఈజీగా తేలకపోవచ్చు. ఎందుకంటే ఈ ప్యాన్ ఇండియా మూవీకి భారీ బడ్జెట్ పెడుతున్నారు. డ్రాగన్ రెండు భాగాలు 2027లో వస్తే కనక ఇప్పుడీ త్రివిక్రమ్ సినిమాని 2029లో ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. అంత ఆలస్యం అవుతుందా అంటే స్కేల్ ప్రకారం చూసుకుంటే చాలా టైం అవసరం పడేలా ఉంది. ఒకవేళ దేవర 2 కనక మధ్యలో చేస్తే ఎక్కువ గ్యాప్ వచ్చిన ఫీలింగ్ ఫ్యాన్స్ కి ఉండదు. కాకపోతే గ్యారెంటీగా చెప్పలేం.

ఇప్పటిదాకా తెలుగులో మాత్రమే సినిమాలు తీస్తూ వచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటిసారి ఇంటర్నేషనల్ మార్కెట్ ని టార్గెట్ చేయబోతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులకు తన పేరుని పరిచయం చేయబోతున్నారు. డబ్బింగ్ రూపంలో వాళ్లకు తెలిసినప్పటికీ ఇంత పెద్ద గ్రాండియర్ ద్వారా అక్కడ లాంచ్ అయితే వచ్చే కిక్కు వేరుగా ఉంటుంది. అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ కు, దేవర తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చబోయే సినిమా ఇదే.