కేరాఫ్ కంచరపాలెం చిత్రంతో అరంగేట్రంలోనే ఇటు ఇండస్ట్రీని, అటు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన దర్శకుడు వెంకటేష్ మహా. కానీ ఇంత గొప్ప సినిమా తర్వాత తన కెరీర్ ఆశించినంత వేగం పుంజుకోలేదు. రెండో చిత్రం ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఓటీటీకి పరిమితమైంది. పైగా అది రీమేక్ కావడంతో మహాకు పెద్దగా క్రెడిట్ రాలేదు. ఆపై నిర్మాతగా మార్టిన్ లూథర్ కింగ్ చేశాడు. అదీ ఆడలేదు.
ఇలాంటి నేపథ్యం ఉన్న దర్శకుడు కమర్షియల్ సినిమాల గురించి ఒక డైరెక్టర్స్ రౌండ్ టేబుల్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ఆ మధ్య దుమారం రేపాయి. ఇంద్రగంటి మోహనకృష్ణ సహా కొందరు దర్శకులను కలుపుకుంటూ తాము అనుకుంటే అలాంటి సినిమాలు తీయడం పెద్ద విషయం కాదన్నట్లుగా కమర్షియల్ సినిమాలను ఉద్దేశించి అన్నాడని విమర్శలు ఎదుర్కొన్నాడు మహా.
అప్పటి వివాదం గురించి తన కొత్త సినిమా రావు బహదూర్ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెంకటేష్ మహా స్పందించాడు. ఆ ఇంటర్వ్యూలో తన వ్యాఖ్యలను కట్ చేసి, తప్పుగా చూపించినట్లు మహా వివరించాడు. తాను కమర్షియల్ సినిమాలను ఏమీ అనలేదని.. వాటి మీద తనకు గౌరవం ఉందని మహా చెప్పాడు. తాను ఆ ప్రోగ్రాంలో వాస్తవానికి విపరీతమైన హింస ఉండే సినిమాల గురించి విమర్శలు చేసినట్లు చెప్పాడు మహా
ఐతే ఆ విషయం కట్ చేశారని.. అంతే కాక తాము అలాంటి సినిమాలు తీయము అన్నది కట్ చేసి.. మధ్యలో అన్న కామెంట్‌ను మాత్రమే వీడియోలో చూపించారని.. దీంతో అందరూ తాను కమర్షియల్ సినిమాలను విమర్శించినట్లు భావించారని.. తనకు తెలిసిన వాళ్లు కూడా అపార్థం చేసుకుని తన పట్ల వ్యతిరేకత పెంచుకున్నారని, విమర్శలు చేశారని వెంకటేష్ మహా వివరించాడు. వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా మహేష్ బాబు, ఛాయ్ బిస్కెట్ అధినేతలు కలిసి నిర్మించిన రావు బహదూర్ జులై 3న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates