రెహమాన్ కంబ్యాక్ జరిగిందా లేదా

పెద్ది థియేటర్ రన్ ముగింపు దిశగా వెళ్తోంది. ఈ వీకెండ్ కాస్త పికపయ్యే అవకాశాలున్నాయి. పాత రీ రిలీజులు తప్ప కొత్తవి లేకపోవడం, మా ఇంటి బంగారం తర్వాత ఆడియన్స్ కి ఇంకో ఆప్షన్ లేకపోవడం రామ్ చరణ్ సినిమాకు ఏ మేరకు ఉపయోగపడతాయో సోమవారానికి తెలుస్తుంది. బుక్ మై షోలో మళ్ళీ ట్రెండింగ్ లోకి రావడం శుభ సంకేతంగా చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ ప్రస్తుతం దీన్ని మరింత ప్రమోట్ చేయడం కోసం లండన్ వెళ్లి ఘనస్వాగతం అందుకున్న సంగతి తెలిసిందే.

ఇక అసలు విషయానికి వస్తే తెలుగులో స్ట్రెయిట్ గా గుర్తుపెట్టుకునే ఆల్బమ్ ఇవ్వలేదనే నెగటివ్ సెంటిమెంట్ మూటగట్టుకున్న ఏఆర్ రెహమాన్ పెద్దితో దాన్ని చాలా మటుకు తగ్గించుకోగలిగారు. ఎందుకంటే కంటెంట్ మీద మిశ్రమ స్పందన రావడానికి గల కారణాల్లో ఎవరూ రెహమాన్ గురించి ప్రస్తావించలేదు. పాటలు బాగున్నాయని అన్నారు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో డెప్త్ ఉందని రాశారు. హలల్లల్లో హాల్లో ఐటెం సాంగ్ ఒకటే ఆశించిన స్థాయిలో రీచ్ తెచ్చుకోలేకపోయింది.

అయితే పెద్ది ఫలితం తెలుగులో రెహమాన్ కు అమాంతం అవకాశాల వర్షం కురిపిస్తుందా అంటే సమాధానం ఎస్ అని చెప్పలేం. ఎందుకంటే మ్యూజిక్ పరంగా రెహమాన్ నిరాశ పరచనప్పటికీ అనిరుధ్, తమన్, డిఎస్పి స్థాయిలో తన బీజీఎమ్ తోనే ప్రత్యేక ముద్ర వేసే స్థాయిలో కనికట్టు చేయలేదనే అభిప్రాయం జనాల్లో ఉంది. అందుకే పెద్ది తర్వాత మొదలైన చాలా ప్యాన్ ఇండియా సినిమాలకు రెహమాన్ పేరు పరిశీలనలో లేదని చెప్పాలి.

చిరంజీవి – బాబీ కాంబోలో రూపొందుతున్న మెగా 158 కోసం ముందు రెహమాన్ నే అనుకున్నారు. కానీ ఎందుకనో మనసు మార్చుకుని తమన్ కే ఓటు వేశారు. ఇప్పటికీ స్టార్ డైరెక్టర్లు తమన్, దేవి, అనిరుద్ తర్వాత కొత్తగా సాయి అభ్యంకార్ పేరు జపిస్తున్నారు. రెహమాన్ కోసం కాంపిటీషన్ పడుతున్న దాఖలాలు అరుదు. ఉన్నంతలో ఊరట ఏంటంటే చికిరి చికిరి, రైరై రారయ్ పాటల ద్వారా ఆయన మాస్ పల్స్ ఇతరులకు పోటీ ఇచ్చే స్థాయిలో ఉందని అర్థమయ్యింది. ఫ్యాన్స్ కి అది చాలు.