సంక్రాంతికి తమిళనాడు బాక్సాఫీస్‌లో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. భారీ అంచనాలతో రాబోతున్న విజయ్ సినిమా ‘మాస్టర్’కు పోటీగా మరే చిత్రం విడుదల కాదని అంతా అనుకున్నారు కానీ.. శింబు తన కొత్త చిత్రం ‘ఈశ్వరన్’ను సంక్రాంతి రేసులో నిలబెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
విజయ్ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా.. సంక్రాంతికి అందుబాటులో ఉన్న అన్ని థియేటర్లలో ఆ చిత్రాన్నే ప్రదర్శించాలని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అనుకున్నారు. కానీ ‘ఈశ్వరన్’ను సంక్రాంతికి రిలీజ్ చేసే విషయంలో శింబు పట్టుబట్టాడు. దీంతో పోటీ అనివార్యమైంది. ఈ నిర్ణయం పట్ల ఇండస్ట్రీలో కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. విజయ్ అభిమానులు శింబు పట్ల గుర్రుగా ఉన్నారు కూడా. సోషల్ మీడియాలో అతణ్ని ట్రోల్ చేస్తున్నారు. ‘మాస్టర్’ దెబ్బకు ‘ఈశ్వరన్’ పచ్చడైపోతుందని కామెంట్లు చేస్తున్నారు. ఐతే ఈ వ్యతిరేకతను గమనించిన శింబు.. విజయ్ అభిమానులను మచ్చిక చేసుకోవడానికి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు.
సంక్రాంతికి ‘ఈశ్వరన్’ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని.. ‘మాస్టర్’ సినిమాకు తమ చిత్రం పోటీ కాదని ఈ ప్రెస్ నోట్లో పేర్కొన్నాడు. దాదాపు ఏడాది ఎదురు చూపుల తర్వాత ‘మాస్టర్’ రిలీజవుతోందని.. ఓటీటీ బాట పట్టకుండా పరిశ్రమ బాగు కోసం విజయ్ ఈ సినిమాను సంక్రాంతికి థియేటర్లలోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకోవడం గొప్ప విషయం అని అన్నాడు శింబు.
విజయ్ తనకు సోదరుడని.. ఆయన అభిమానులన్నా తనకెంతో ఇష్టమని పేర్కొన్న శింబు.. సంక్రాంతికి విజయ్ అభిమానులందరూ తన సినిమా ‘ఈశ్వరన్’ను కూడా చూడాలని అన్నాడు. అలాగే తన అభిమానులు ‘మాస్టర్’ చిత్రం చూడాలని పిలుపునిచ్చాడు. రెండు సినిమాలూ బాగా ఆడి.. ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్లకు మంచి జరగాలని అతను అభిలషించాడు. తాజాగా తమిళనాడు ప్రభుత్వం థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో సంక్రాంతికి ‘మాస్టర్’తో ‘ఈశ్వరన్’ పోటీ పడటం వల్ల పెద్ద ఇబ్బందేమీ ఉండదని భావిస్తున్నారు.