సరదా ట్విస్టులతో వెంకీ అనిల్ కాంబో

దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పిన ప్రకారమే తన కొత్త సినిమా షూటింగ్ ఇవాళ మొదలుపెట్టేశారు. వెంకటేష్ కళ్యాణ్ రామ్ కలయికలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ఫన్ డ్రామాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. అయితే స్టోరీ గురించి పెద్దగా లీక్స్ బయటికి రాలేదు కానీ రెండున్నర గంటల పాటు సరదా ట్విస్టులతో ఆద్యంతం అలరించేలా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. దానికి ఉదాహరణగా కొన్ని రెఫరెన్సులు బయటికి వస్తున్నాయి.

రెండేళ్ల క్రితం మలయాళంలో గురువాయూర్ అంబలనాడైల్ అనే మూవీ వచ్చింది. మంచి విజయం సాధించింది. స్టోరీలో భలే మలుపులు ఉంటాయి. ప్రేమించిన అమ్మాయి అన్నయ్యకి దగ్గరైన సెకండ్ హీరోకి, కాబోయే బావ గారి భార్యే తన మాజీ ప్రియురాలని తెలుస్తుంది. అప్పటిదాకా ఫ్రెండ్స్ గా ఉన్న ఇద్దరు కథానాయకులు అక్కడి నుంచి ఫన్నీ శత్రువులుగా మారిపోతారు. పెళ్లి విషయంలో ఊహించని పరిణామాలు జరుగుతాయి. దీన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు.

ఇప్పుడు అనిల్ రావిపూడి తీస్తున్నది ఇది కాదు. రీమేక్ అసలే కాదు. ఈ టైపులో వినోదాన్ని ఎక్కువ పంచుతూ లైట్ గా కమర్షియల్ టచ్ ఇస్తూ ఈసారి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని లక్ష్యంగా పెట్టుకున్నారట. పేరుకు ఇద్దరు హీరోలు ఉన్నప్పటికీ కీర్తి సురేష్, కృతి శెట్టిలతో కలిసి వచ్చే సన్నివేశాలు ఓ రేంజ్ లో పేలతాయని అంటున్నారు. ప్రస్తుతానికి జనవరి 13 విడుదల అనే టైటిల్ ప్రచారంలో ఉన్నప్పటికీ ఎవరూ ఊహించనంత వెరైటీ పేరు వేరే సిద్ధం చేశారట రావిపూడి.

2027 సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ కల్లా పూర్తి చేసి రెండు వారాలు ప్రమోషన్లు చేయబోతున్నారు. పబ్లిసిటీ విషయంలో ఎప్పుడూ తనదైన మార్కు చూపించే అనిల్ రావిపూడి ఈసారి కూడా ఆ ప్రత్యేకతను నిలుపుకోబోతున్నారు. క్యాస్టింగ్ పాల్గొన్న ఒక వీడియో ప్రోమోని రేపు ప్రత్యేకంగా రిలీజ్ చేయబోతున్నారు. వచ్చే సంవత్సరం పండక్కు పోటీ ఎక్కువగా ఉండబోతున్న నేపథ్యంలో వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ త్రయం పెద్ద ఛాలెంజ్ ఎదురుకోవాల్సి ఉంటుంది.