పరుగు మొదలెట్టిన రావిపూడి ఎక్స్ ప్రెస్

మన శంకరవరప్రసాద్ గారుతో 2026 తొలి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి ఆరు నెలలు గ్యాప్ తీసుకుని కొత్త సినిమా మొదలుపెట్టేశారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కలయికలో రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ లో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం, అనంత శ్రీరామ్ సాహిత్యంలో ఆల్రెడీ మూడు పాటల రికార్డింగ్ అయిపోయిందట. హైదరాబాద్ లో జరిగిన ఓపెనింగ్ ఘనంగా నిర్వహించారు.

తొలి షాట్ నుంచే అనిల్ రావిపూడి తన మార్కు చూపించారు. ఇద్దరి జంటలను పక్క పక్కన నిలుచోబెట్టి తర్వాత నువ్వు అటు నేను ఇటు అంటూ కీర్తి సురేష్, కృతి శెట్టిని హీరోల వైపుకు మార్పించడం ఫన్నీగా ఉంది. దీన్ని బట్టే ఇందులో ఎంటర్ టైన్మెంట్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రాఘవేంద్రరావు, దిల్ రాజు, శిరీష్, అల్లు అరవింద్ మొదలైన ప్రముఖులు గెస్టులుగా విచ్చేసిన ఈ ఈవెంట్ పూజా కార్యక్రమాలు నిర్మాత సాహో గారపాటి నిర్వహించారు.

2027 సంక్రాంతి విడుదలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ సినిమా చేతిలో ఉన్నది ఆరు నెలలు. షూటింగ్, పాటల చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ మీడియా పబ్లిసిటీ, సెన్సార్ తదితర వ్యవహారాలన్నీ ఈ టైంలోనే అయిపోవాలి. అనిల్ కు ఇది కొత్త కాదు. మహేష్ బాబు అంతటి సూపర్ స్టార్ తో సరిలేరు నీకెవ్వరుని కేవలం నూటా ఎనభై రోజుల్లో గుమ్మడికాయ కొట్టించారు. చిరంజీవితో పరుగులు పెట్టించడం వల్లే పండక్కు అంత పెద్ద ఘనవిజయం దక్కింది.

సో వేగం సమస్యే కాదు. పైగా వెంకటేష్, అనిల్ సింక్ మామూలుది కాదు. అయిదోసారి చేతులు కలిపారు. ఇప్పటిదాకా ఫ్లాప్ అంటే తెలియని కలయిక ఇది. టాలీవుడ్ లో చాలా అరుదనే చెప్పాలి. తనకు డెబ్యూ మూవీ ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ తో అనిల్ రావిపూడి రెండోసారి జత కట్టారు. పూర్తి ఫన్ తో పాటు యాక్షన్ టచ్ ఉన్న ఈ మూవీలో నలుగురి పాత్రలు చేసే అల్లరి ఓ రేంజ్ లో ఉండబోతోందట. జనవరి 13 విడుదల అనే వెరైటీ టైటిల్ ఆల్రెడీ ప్రచారంలో ఉంది.