హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ కు ఇండియాలోనూ వీర ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు అర్థమైనా కాకపోయినా కల్ట్ మేకింగ్ కి నిర్వచనం ఇచ్చే ఈ సీనియర్ డైరెక్టర్ మూవీస్ అంటే ఎగబడిపోయేవాళ్లు కోట్లలో ఉన్నారు. అందుకే ఇంటర్ స్టెల్లార్ ఎప్పుడు రీ రిలీజ్ చేసినా కనకవర్షం కురిపిస్తుంది. ఓపెన్ హెయిమర్ కు వచ్చిన ఓపెనింగ్స్, ఫైనల్ రెవిన్యూ అంత సులభంగా మర్చిపోయేది కాదు. అలాంటి నోలన్ నుంచి కొత్త మాస్టర్ పీస్ ‘ఒడిస్సీ’ వచ్చే నెల 17 విడుదల కానుంది.
మన దేశంలో ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈసారి క్రిస్టఫర్ నోలన్ ముంబైలో జరగబోయే ఐమాక్స్ ప్రీమియర్ కు అతిథిగా రాబోతున్నారని సమాచారం. న్యూ యార్క్, లండన్ పారిస్ లాంటి నగరాల్లో వేస్తున్న స్పెషల్ షోలకు ధీటుగా ఇక్కడ కూడా ప్లాన్ చేశారంటే హైప్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. విదేశాల్లో మరీ టూ మచ్. కొన్ని చోట్ల స్పెషల్ షో ధర పదిహేను లక్షల దాకా పలికిందట. అంతగా ఒడిస్సీ కోసం జనం అల్లాడిపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రేజ్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ మూవీ లవర్స్ టికెట్స్ పెట్టడం కోసం ఎదురు చూస్తున్నారు. అందుబాటులోకి రావడం ఆలస్యం క్షణాల్లో సోల్డ్ అవుట్ బోర్డులు పడేలా ఉన్నాయి. సుప్రసిద్ధ గ్రీకు కవి రాసిన హోమర్ అనే కావ్యం ఆధారంగా ఒడిస్సీని తీశారు. ఇందులో యుద్ధాలు, సాహసాలతో పాటు ఎమోషన్లు, కన్నీళ్లు, కుటుంబ బంధాలు అన్నీ ఉంటాయి. రెగ్యులర్ ఇంగ్లీష్ మూవీస్ లాగా కాకుండా మూడు గంటలకు పైనే నిడివి ఉంటుంది.
ఓపెన్ హెయిమర్ ని ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ చేయలేదు. దాని వల్ల చాలా మంది అనువాద వెర్షన్లు లేక ఇబ్బంది పడ్డారు. ఒడిస్సీకి ఆ సమస్య లేదు. శుభ్రంగా తెలుగులోనూ చూడొచ్చు. అతి పెద్ద తెరమీద చూస్తే మర్చిపోలేని విజువల్ ఎక్స్ పీరియన్స్ దక్కుతుందని మేకర్స్ తెగ ఊరిస్తున్నారు. దానికి తగ్గట్టే ముంబై, ఢిల్లీ లాంటి నగరాల్లో ఐమాక్స్ టికెట్ ధర మూడు వేల రూపాయల దాకా ఉంటోంది. ,ఇంతగా హడావిడి చేస్తున్న ఒడిస్సీ ఈసారి అన్ని వర్గాలను మెప్పిస్తుందేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates