మ‌హాభార‌తం ప‌ని ఇప్పుడు కాద‌న్న జ‌క్క‌న్న‌

త‌న క‌ల‌ల ప్రాజెక్టు మ‌హాభార‌తం గురించి ఇప్ప‌టికే ప‌లుమార్లు మాట్లాడాడు రాజ‌మౌళి. ఆ సినిమా తీయ‌డానికి ప‌దేళ్లు ప‌డుతుంద‌ని జ‌క్క‌న్న చెప్పి నాలుగైదేళ్లు కావ‌స్తోంది. ప్ర‌స్తుతం చేస్తున్న ఆర్ఆర్ఆర్.. ఆ త‌ర్వాత మ‌హేష్ బాబుతో చేయ‌బోయే సినిమా పూర్త‌య్యే స‌మ‌యానికి మ‌హాభార‌తం చేసేందుకు ముహూర్తం కుదురుతుందేమో.. అప్పుడు మొద‌లుపెడితే.. జ‌క్క‌న్న ముందు ప్ర‌క‌ట‌న చేసిన‌ప్ప‌టి నుంచి ప‌దేళ్ల‌కు మ‌హాభార‌తం సినిమాలో ఒక పార్ట్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుందేమో అని అంచ‌నా వేస్తున్నారు.

ప్ర‌స్తుతం లాక్ డౌన్ కార‌ణంగా రాజ‌మౌళి ఖాళీగా ఉంటున్న నేప‌థ్యంలో మ‌హాభార‌తం మీద వ‌ర్క్ ఏమైనా మొద‌లుపెట్టారేమో అన్న ఆలోచ‌నా క‌లుగుతోంది. ఇటీవ‌ల రాజ‌మౌళి మేక్ మ‌హాభార‌తం అంటూ ఉత్త‌రాది జ‌నాలు ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేయ‌డం.. దీని మీద పెద్ద చ‌ర్చ న‌డవ‌డం తెలిసిన సంగ‌తే.

ఈ నేప‌థ్యంలో జ‌క్క‌న్న‌ను త‌న క‌ల‌ల ప్రాజెక్టు గురించి అడిగితే.. మ‌హాభార‌తం ప‌నులు మొద‌లుపెట్టాల్సిందే అని.. కానీ దానికి ఇంకా కొంచెం స‌మ‌యం ప‌డుతుంద‌ని చెప్పాడు. ఇప్పుడు ఖాళీ దొరికింది క‌దా అని దాని మీద కూర్చుని ప‌ని చేసే ప్రాజెక్టు ఇది కాద‌ని జ‌క్క‌న్న స్ప‌ష్టం చేశాడు.

చాలా శ‌క్తి సామ‌ర్థ్యాలు పెంపొందించుకోవాల‌ని.. పూర్తిగా దాని మీదే దృష్టిసారించాల‌ని.. అప్పుడు కానీ మ‌హాభార‌తం ప్రాజెక్టును మొద‌లుపెట్ట‌లేమ‌ని రాజ‌మౌళి అన్నాడు. కాబ‌ట్టి చేతిలో ఉన్న క‌మిట్మెంట్ల‌న్నీ పూర్త‌యి.. ఇక మ‌హాభార‌తం చేద్దామ‌నుకున్న‌పుడే రాజ‌మౌళి ఆ సినిమా ప‌నులు త‌ల‌కెత్తుకుంటాడ‌న్న‌మాట‌.