ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి. నార్త్ మార్కెట్‌లో ఆ సినిమా ప్రభంజనం సృష్టించడం.. తర్వాత కేజీఎఫ్, పుష్ప, ఆర్ఆర్ఆర్, కాంతార, కార్తికేయ-2 లాంటి మరెన్నో దక్షిణాది సినిమాలు ఉత్తరాదిన ఆధిపత్యం చలాయించడంతో వాటి ముందు హిందీ సినిమాలు చిన్నబోయే పరిస్థితి వచ్చింది.
అందుకే రాబోయే ముప్పు అర్థం కాక ‘బాహుబలి’ని నెత్తిన పెట్టుకున్న బాలీవుడ్ మీడియా ప్రతినిధులు, అక్కడి సెలబ్రెటీలు.. తర్వాత తీరు మార్చేశారు. దక్షిణాది సినిమాలను చూసి అసూయ పడడం మొదలుపెట్టాయి. అంతటితో ఆగకుండా సౌత్ సినిమాల గురించి నెగెటివ్ ఆర్టికల్స్ రాయడం, సోషల్ మీడియాలో విష ప్రచారాలు చేయడం కూడా ఇటీవల తరచుగా చూస్తున్నాం. ఇటీవల ‘పెద్ది’ని అనే పనిగా నార్త్ ఇండియా సోషల్ మీడియా హ్యాండిల్స్ టార్గెట్ చేశాయి.
ఐతే సౌత్ నుంచి రాబోయే భారీ చిత్రాలను కూడా బాలీవుడ్ ఇలాగే టార్గెట్ చేయబోతోందని స్పష్టమవుతోంది. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ అనదగ్గ ‘వారణాసి’ మీద గత రెండు రోజులుగా విష ప్రచారం నడుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ హద్దులు దాటిపోయిందని.. పెట్టుబడిని ఎలా రాబట్టుకోవాలో తెలియక రాజమౌళి జుట్టు పీక్కుంటున్నాడని నార్త్ సినిమా హ్యాండిల్స్ ప్రచారం చేస్తున్నాయి.
ఈ సినిమాకు రాజమౌళి ఐదారొందల కోట్లు డిజిటల్ హక్కుల ద్వారా ఆశిస్తుంటే.. అందులో నాలుగో వంతుకు మించి ఓటీటీలు ఆఫర్ చేయట్లేదని కూడా వార్తలు వడ్డిస్తున్నారు.
కానీ రాజమౌళిని మించిన మార్కెటింగ్ కింగ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇంకొకరు లేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమా అంటే ఎంత రేటు చెబితే అంతిచ్చి హక్కులు తీసుకోవడానికి ఇటు బయ్యర్లు, అటు ఓటీటీలు ఎప్పుడైనా రెడీ. మారుతున్న మార్కెట్ పరిణామాలతో జక్కన్న సినిమాలకు అసలేం సంబంధం ఉండదు.
‘వారణాసి’కి ఇండియాలోనే కాదు.. గ్లోబల్‌గానూ ఉన్నది మామూలు డిమాండ్ కాదు. నిజానికి బాలీవుడ్ నుంచి వస్తున్న నాలుగువేల కోట్ల సినిమా ‘రామాయణం’కే అంతగా డిమాండ్ లేదు. దాని బిజినెస్ సంగతే అయోమయంగా ఉందన్నది చిత్ర వర్గాల మాట. దాని సంగతేంటో తేల్చకుండా విపరీతమైన డిమాండ్ ఉన్న ‘వారణాసి’ గురించి నెగెటివ్ వార్తలు పుట్టించడం సౌత్ సినిమా, ముఖ్యంగా తెలుగు చిత్రాల మీద బాలీవుడ్ ఏడుపుకి నిదర్శనం.
Gulte Telugu Telugu Political and Movie News Updates