టాలీవుడ్లో అక్కినేని కుటుంబానికి అన్నపూర్ణ పేరుతో పెద్ద స్టూడియో ఉంది. నందమూరి ఫ్యామిలీకి రామకృష్ణ స్టూడియోస్ ఉంది. అలాగే దగ్గుబాటి వారి రామానాయుడు స్టూడియోస్ గురించీ తెలిసిందే. ఐతే టాలీవుడ్లో అతి పెద్ద ఫ్యామిలీస్‌లో ఒకటైన మెగా కుటుంబానికి మాత్రం స్టూడియో లేదు. గీతా ఆర్ట్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో నాలుగు దశాబ్దాలుగా సినిమాలు నిర్మిస్తున్న అల్లు అరవింద్ ఇప్పటిదాకా స్టూడియో ఆలోచన చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఐతే ఎట్టకేలకు అల్లు పేరుతో స్టూడియో నిర్మాణానికి ఇటీవలే పునాది పడింది. ఐతే ఈ స్టూడియో ఆలోచన అరవింద్‌ది కాదట. ఆయన కొడుకు అల్లు అర్జున్‌దట. అతనే స్టూడియో నిర్మిద్దామని తండ్రికి చెప్పి, ఆయనతో పాటు కుటుంబంలో అందరినీ ఒప్పించాడట. ఐతే తనకా ఆలోచన రావడానికి కారణమేంటో ఆహాలో ప్రసారమవుతున్న సామ్ జామ్ షోలో బన్నీ వెల్లడించాడు.
ఈ షోలో సమంతను ఉద్దేశించి బన్నీ మాట్లాడుతూ మీకు కూడా స్టూడియో ఉంది కదా (అన్నపూర్ణ), అలాగే పెద్ద ఫ్యామిలీస్ అన్నింటికీ స్టూడియోలున్నాయి.. మనకు కూడా ఒక స్టూడియో ఉంటే బాగుణ్నే అని ఎప్పట్నుంచో అనుకుంటూ ఉండేవాడిని. ఒకసారి అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ కోసం వెళ్లినపుడు అక్కడి వ్యక్తి ఒకరు వెల్కమ్ టు అన్నపూర్ణ స్టూడియో సార్ అన్నాడు. ఆ పిలుపు విన్నపుడు కూడా మనకు కూడా ఇలా ఓ స్టూడియో ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. అందుకే ఈ మధ్య నాన్నతో మాట్లాడి స్టూడియో నిర్మిద్దామని అన్నా. కుటుంబంలో అందరూ ఒప్పుకోవడంతో స్టూడియో నిర్మాణం మొదలైంది.
నేను ఉన్నంత వరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటా. అంత కాలం నాకు స్టూడియో ఉపయోగపడుతుంది.. అలాగే ఇండస్ట్రీకి కూడా మనం ఒక ప్రపంచ స్థాయి స్టూడియో అందించాలి అన్న ఉద్దేశంతో ఈ స్టూడియో నిర్మాణం మొదలుపెట్టాం అని బన్నీ తెలిపాడు.