చిరంజీవి & చరణ్… ఇద్దరికే సాధ్యమయ్యింది

2026 సంవత్సరంలో ఆరు నెలలు దాదాపుగా పూర్తయ్యాయి. ఇంకో రెండు వారాలు బాలన్స్ ఉంది. ఈ ఏడాది మొత్తంలో పదమూడు రోజుల తర్వాత కూడా హౌస్ ఫుల్ బోర్డులు పెట్టిన ఘనత కేవలం రెండు సినిమాలు దక్కించుకున్నాయి. మొదటిది మన శంకరవరప్రసాద్ గారు, రెండోది పెద్ది. గడిచిన నూటా అరవై అయిదు రోజుల కాలంలో డీసెంట్ హిట్లు రెండు మూడు పడ్డాయి కానీ వరసగా బుక్ మై షో ట్రెండింగ్ లో ఉండటం, సెకండ్ వీక్ బలంగా ఉండటం వేరెవరికీ సాధ్యం కాలేదు.

తండ్రి కొడుకులైన చిరంజీవి, రామ్ చరణ్ ఈ క్రెడిట్ దక్కించుకోవడం పట్ల మెగా ఫ్యాన్స్ ఆనందం మాములుగా లేదు. రెండు సినిమాలు మూడు వందల కోట్ల క్లబ్బులో అడుగు పెట్టేశాయి. పెద్ది ఒక అడుగు ముందుకేసి నాలుగో సెంచరీ కొట్టే అవకాశాలు లేవని చెప్పలేం. అయితే ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాల పెర్ఫార్మన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల తక్కువ టైంలో నమోదు కావాల్సిన పెద్ద నెంబర్లకు ఎక్కువ సమయం అవసరమవుతోంది. పెద్దికి ఇదొక్కటే సమస్య.

మధ్యలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా బ్లాక్ బస్టర్ అయ్యుంటే మెగా ఫ్యామిలీకి ఈ సంవత్సరం ఇంకా స్పెషల్ గా మారి ఉండేది. కానీ ఛాన్స్ మిస్ అయ్యింది. ఇక్కడ గమనించాల్సిన విషయాలు మరికొన్ని ఉన్నాయి. మన శంకరవరప్రసాద్ గారు, పెద్ది విడుదల ముందు ట్రైలర్లకు నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది. కాకపోతే చిరు మూవీ యునానిమస్ అనిపించుకుంటే పెద్ది మిక్స్డ్ టాక్ కొనసాగించాల్సి వస్తోంది.

చిరు చరణ్ ఇద్దరు కలిసి బాక్సాఫీస్ కు ఏడు వందల కోట్ల దాకా జమ చేస్తున్నారు. ఇది థియేటర్ రెవిన్యూ మాత్రమే. ఇతరత్రా హక్కులు అన్నీ కలుపుకుంటే సహస్రం కంటే ఎక్కువే అవుతుంది. మెగాస్టార్ లో పుత్రోత్సాహం బాగా కనిపిస్తోంది. ఒకవేళ పెద్ది కనక యుఎస్, బాలీవుడ్ లోనూ హిట్ అయ్యి ఉంటే సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండేవి. బుధవారం నుంచి కొత్త సీన్లు, మార్పులు ఉంటాయని చెప్పారు కానీ ఫ్యాన్స్ ని అవి మళ్ళీ థియేటర్లకు రప్పిస్తాయేమో చూడాలి.