విపరీతమైన ప్రేమ కాసులు కురిపిస్తుందా

వన్ సైడ్ లవ్ తెలుగు తెరకు కొత్త కాదు. కొన్ని వందల సార్లు చూసుంటాం. కాకపోతే చెప్పే విధానంలో దర్శకులు అనుసరించే శైలి వల్ల ఒక్కోసారి ఒక్కోలా కనిపిస్తుంది. ఫలితాలు కూడా దానికి తగ్గట్టే మారుతూ ఉంటాయి. సుకుమార్ ఆర్య తర్వాత ఇందులో కొత్త ట్రెండ్ మొదలయ్యింది. అమ్మాయికి ముందు ఇష్టం లేకపోయినా ఎలాంటి హానీ చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా ఎలా ప్రేమించేలా చేసుకోవాలో అల్లు అర్జున్ ద్వారా చూపించిన విధానం బ్లాక్ బస్టర్ అందించింది.

అర్జున్ రెడ్డిలో కూడా విజయ్ దేవరకొండ తొలుత ఒకవైపు ప్రేమను మొదలుపెట్టి తర్వాత షాలిని పాండేని తన ప్రేమని పెంచుకునేలా చేస్తాడు. జూన్ 19 విడుదల కాబోతున్న దీవానా ఇదే రూటు పట్టినట్టు కనిపిస్తోంది. ఉద్యోగం చేసుకునే అమ్మాయి వెనుక ఒక కుర్రాడు ప్రేమ అంటూ వెంటపడతాడు. ఆమె అంటే పిచ్చి ప్రాణం. కానీ తనకేమో ఇష్టం ఉండదు. ఇంటా బయటా ఎన్నో దెబ్బలు, అవమానాలు తింటాడు. అయినా చలించదు. తర్వాత ఏమైందో జూన్ 19 చూడమంటున్నారు.

పవన్ కళ్యాణ్ సుస్వాగతం ఛాయల్లో కనిపిస్తుప్పటికీ దీనికి కొంచెం వైల్డ్ టచ్ ఇచ్చాడు దర్శకుడు శ్రీకాంత్ సంఘీశెట్టి. కాకపోతే ఇలాంటివి కొత్త కాదు. రాజశేఖర్ ఓం కూడా ఇదే బాపతే. కానీ టీమ్ మాత్రం కల్ట్ లవ్ స్టోరీ లాగా నిలిచిపోతుందని, కన్నీళ్లు పెట్టకుండా బయటికి రాలేరని నమ్మకంగా చెబుతోంది. ఇన్నిసార్లు చూసేసిన వన్ సైడ్ లవ్ ని 2026 ప్రేక్షకులకు తగ్గట్టు ఎలా మలచారో చూడాలి. ఆల్రెడీ బల్లి పిల్ల అనే సాంగ్ యూత్ లో వైరల్ అయ్యింది.

వచ్చే వారం సమంత మా ఇంటి బంగారం, విజయ్ ఆంటోనీ వంద దేవుళ్ళు, మలయాళం డబ్బింగ్ బాలన్ తో పోటీ పడుతున్న దీవానాకు స్కోప్ అయితే ఉంది. కాకపోతే యునానిమస్ టాక్ తెచ్చుకోవాలి. గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ కావడంతో స్వయంగా అల్లు అరవింద్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చారు. విశ్వక్ సేన్ అతిథిగా వచ్చి కాసింత నవ్వులు పంచాడు. హీరో హర్షిత్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. చూడాలి ఈ దివానా ఏం చేస్తాడో.