బాబీతో చిరు.. ముహూర్తం కుదిరిందా?

క‌రోనా విరామం త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి మాంచి స్పీడు మీదున్నారు. గ‌త నెల‌లోనే మ‌ళ్లీ ఆచార్య సెట్లోకి అడుగు పెట్టిన ఆయ‌న‌.. ఇంకో నెల రోజుల్లో ఈ సినిమాను ముగించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఈ నెల చివ‌ర్లో లేదా ఫిబ్ర‌వ‌రి ఆరంభంలో లూసిఫ‌ర్ రీమేక్‌ను చిరు మొద‌లుపెట్ట‌బోతున్నారు. ఈ చిత్రాన్ని మూణ్నాలుగు నెల‌ల్లోనే చిరు పూర్తి చేయాల‌ని ప్లాన్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

దీని త‌ర్వాత మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో వేదాళం రీమేక్ కూడా ఖ‌రారైంది. అది ప‌క్కాగా ఎప్పుడు మొద‌ల‌వుతుంద‌న్న‌దే తేలాల్సి ఉంది. కాగా ప‌వ‌ర్, స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్, జై ల‌వ‌కుశ చిత్రాల ద‌ర్శ‌కుడు బాబీతోనూ ఓ సినిమా చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్న చిరు ఇంత‌కుముందే వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

ఐతే చాలా రోజులుగా లూసిఫ‌ర్‌, వేదాళం రీమేక్‌ల హ‌డావుడే క‌నిపిస్తోంది.. వాటి అప్ డేట్లే బ‌య‌టికి వ‌స్తున్నాయి త‌ప్ప‌.. బాబీతో చిరు సినిమాపై చ‌ప్పుడు లేదు. చిరు కూడా ఎక్క‌డా దాని గురించి మాట్లాడ‌ట్లేదు. దీంతో ఈ సినిమా ఉంటుందా లేదా అన్న సందేహాలు క‌లుగుతున్నాయి. ఐతే తాజా స‌మాచారం ప్ర‌కారం ఆ సినిమా ఎప్పుడు మొద‌లెడ‌తారో ఏంటో కానీ.. ముందు అయితే ముహూర్త కార్య‌క్ర‌మం జ‌రిపించేయ‌బోతున్నార‌ట‌.

సంక్రాంతి ముంగిట ఈ కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని అంటున్నారు. చిరు ఓ క‌థ‌ను ఓకే చేశార‌ని.. ఐతే పూర్తి స్క్రిప్టు రెడీ చేసే ప‌నిలో బాబీ బిజీగా ఉన్నాడ‌ని.. అత‌ను ప్ర‌శాంతంగా ప‌ని చేసుకోవ‌డం కోసం ముహూర్తం జ‌రిపించేసి.. మిగ‌తా సినిమాల ప‌నిలో చిరు ప‌డిపోతార‌ని.. అంతా ఓకే అనుకున్నాక‌, త‌న‌కు కుదిరిన‌పుడు ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లాల‌న్న‌ది చిరు ప్ర‌ణాళిక అని అంటున్నారు.