సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న గ్యారెంటీ లేదు. దీనికి పెద్దా చిన్నా సినిమా అనే భేదం ఉండదు. ఎల్లుండి జూన్ 11 విడుదల కావాల్సిన సింగ్ గీతం ఒక రోజు ఆలస్యంగా జూన్ 12 థియేటర్లలో అడుగు పెట్టనుంది. కొన్ని సాంకేతిక కారణాలతో పాటు ఓవర్సీస్ కంటెంట్ చేరడంలో తలెత్తిన సమస్య వల్ల ఇరవై నాలుగు గంటలు లేట్ అవ్వాల్సి వచ్చిందని అంతర్గత మాట. ఇదేమి సీరియస్ ఇష్యూ కాదు.

94 వయసులో దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు పడిన కష్టానికి తగిన గుర్తింపు, రీచ్ రావాలనే ఉద్దేశంతో వైజయంతి మూవీస్, స్వప్న సినిమా సంస్థలు రేయింబవళ్లు కష్టపడుతున్నాయి. మాములుగా ఇలాంటి బడ్జెట్ లో తీసిన సినిమాకు ఇంత పబ్లిసిటీ అవసరం లేదు. కానీ దాన్ని బాధ్యతగా తీసుకున్నారు. కమల్ హాసన్ ని తీసుకొచ్చి ఈవెంట్ చేసినా, హైదరాబాద్ ఫిలిం నగర్ గోడల మీద గ్రాఫైట్ పెయింటింగ్ వేయించినా అదంతా సింగీతం మీద గౌరవంతోనే.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ మ్యూజికల్ ఫాంటసీ డ్రామా మొత్తం పాటల మీదే నడుస్తుంది. పుష్పక విమానం కన్నా ఇదో గొప్ప ప్రయోగంగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితమే కమల్ దీన్ని చేయాలనుకున్నారు కానీ ఆ సమయంలో పరిస్థితుల వల్ల సాధ్యపడలేదు. అప్పటి నుంచి ఈ స్క్రిప్ట్ కాలదోషం లేకుండా ప్రయాణం చేస్తూనే వచ్చింది. నాగ్ అశ్విన్ కు విపరీతంగా నచ్చేయడంతో కార్యరూపం దాల్చేసింది.

పెద్ది బాక్సాఫీస్ వద్ద ఉన్నప్పటికీ వేరే ఇతర పోటీ లేకపోవడం వల్ల సింగ్ గీతంకు ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకోగలిగితే ఖచ్చితంగా వసూళ్లు వస్తాయి. నిర్మాతలు ఏదో రికార్డులు బద్దలు కావాలని కోరుకోవడం లేదు. సింగీతం శ్రీనివాసరావు గారి శ్రమను ఆడియన్స్ గుర్తించాలి. థియేటర్ కు వచ్చి చూడటం ద్వారా గౌరవించాలి. ప్రపంచంలో ఎవరికి సాధ్యం కానీ ఒక అరుదైన ప్రయత్నాన్ని వయసు, ఆరోగ్యం లెక్క చేయకుండా తెరకెక్కించినందుకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే.