సాయిపల్లవి వదులుకుంటే సమంత అందుకుంది

జూన్ 19 మా ఇంటి బంగారం విడుదలకు రెడీ అవుతోంది. శాకుంతలం, ఖుషి తర్వాత సమంతకు బాగా గ్యాప్ వచ్చేసింది. తనే నిర్మించిన శుభంలో చిన్న క్యామియో చేసినప్పటికీ అదేమంత పనవ్వలేదు. ఈసారి ఆశలన్నీ మా ఇంటి బంగారం మీదే పెట్టుకుంది. టైటిల్ రోల్ తనదే. నిర్మాత కూడా ఆమె. రాజ్ నిడిమోరుతో పెళ్ళయాక ఇద్దరి ప్రొడక్షన్ లో వస్తున్న తొలి మూవీ ఇదే కావడంతో చాలా స్పెషల్ గా ఫీలవుతోంది. కొంచెం పెద్ది హడావిడి తగ్గాక ప్రమోషన్ల వేగం పెంచబోతున్నారు.

ఈ సందర్భంగా ఆన్ లైన్ లో తన అభిమానులతో ముచ్చటించిన సమంత ఒక కీలక విషయాన్ని పంచుకుంది. మా ఇంటి బంగారం ముందు సాయిపల్లవి కోసం అనుకున్నారట. ఆ మేరకు సబ్జెక్టు రెడీ చేసి ట్రై చేస్తే డేట్స్ సమస్య వల్ల ఆమె చేయడం సాధ్యపడదని అర్థమైపోయి, ఆ తర్వాత సామ్ కు తగ్గట్టు కొన్ని మార్పులు చేసి ఫైనల్ టచప్ ఇచ్చారు. ఇదంతా స్వయంగా సమంతనే చెప్పడంతో నిజం బయటపడింది. ఒకవేళ సాయిపల్లవి ఒప్పుకుని ఉంటే బజ్ ఎలా ఉండేదో.

లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన మా ఇంటి బంగారం సమంత, సాయిపల్లవి ఇద్దరిలో ఎవరు చేసినా మేజర్ బ్రేక్ త్రూ అయ్యేదేమో. ఇమేజ్ పరంగా ఇద్దరినీ ఒకే గాటన కట్టలేం కానీ పెర్ఫార్మన్స్ కు ప్రాధాన్యం ఇచ్చే వాళ్ళు ఒకరైతే, నటనతో పాటు అవసరానికి తగ్గట్టు కమర్షియల్ రోల్స్ ఎంచుకోవడం మరొకరి స్టయిల్. సో తెరమీద చూసే దాకా ఎవరు రైట్ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది చెప్పలేం. కాకపోతే సాయిపల్లవికి కొంచెం ఎక్కువ ఎడ్జ్ వచ్చేదేమో.

ఈసారి వాయిదా ప్రసక్తే లేదంటున్న సమంత జూన్ 19 నుంచి వెనక్కు తగ్గే సూచనలు లేవని కుండ బద్దలు కొడుతోంది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఒక సాంప్రదాయ కుటుంబానికి కోడలిగా వచ్చిన యువతి వెనుక గన్నులు పట్టుకుని మనుషులను పిట్టల్లా కాల్చి పారేసిన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది ఆమె వర్తమానాన్ని కూడా వెంటాడుతుంది. ఈ వలయం నుంచి ఆమె ఎలా బయట పడి తప్పించుకుందనే పాయింట్ ఆధారంగా మా ఇంటి బంగారంని తెరకెక్కించారు.