కష్టపడితే సరిపోదు… వేగం కూడా అవసరమే

ఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి పది పదిహేను సినిమాలు రిలీజ్ చేసేవాళ్ళంటే నమ్మడానికి అసాధ్యం అనిపించినా ఒకదశలో కృష్ణ, చిరంజీవి లాంటి వాళ్ళు దాన్ని చేసి చూపించారు. కానీ ఇప్పుడు ప్యాన్ ఇండియా పేరుతో రెండేళ్లకు ఒక మూవీ చేస్తే అదే మహా భాగ్యం అనుకునే పరిస్థితి అభిమానుల్లో తలెత్తింది. పోనీ అవేమైనా వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయా అంటే అదీ లేదు. మొన్నటికి మొన్న పెద్ది ఏపీ తెలంగాణ మినహాయించి బయట చూపించిన పరాక్రమం అంతంతమాత్రమే.

రామ్ చరణ్ పరిశ్రమకు వచ్చి 19 సంవత్సరాలయ్యింది. ఇప్పటిదాకా చేసింది కేవలం 16 సినిమాలు. వాటిలో ఆచార్య క్యామియో కూడా ఉంది. అంటే సగటున ఏడాదికి ఒక్కటి కూడా రాలేదు. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ కు ఎంత విలువైన సమయం బూడిదలో పోసిన పన్నీరయ్యిందో ఫ్యాన్స్ అంత సులభంగా మర్చిపోలేదు. గాయం కారణంగా షూటింగ్ మొదలుకాలేదు కానీ ఆర్సి 17 మొదలుపెట్టాక దర్శకుడు సుకుమార్ ఎంత టైం తీసుకుంటారో ఎవరి ఊహకు అందటం లేదు.

పరిస్థితి ఎలా ఉందంటే ఆరేళ్ళ క్రితం పరిచయమైన కిరణ్ అబ్బవరం అప్పుడే పదిహేను సినిమాలు చేసేశాడని చరణ్ తో పోల్చి మరీ ట్రోల్ చేసే దాకా వెళ్ళింది. ఇది కావాలని చేశారా లేక ఇంకొకటా అనేది పక్కన పెడితే ఈ పోలిక సమంజసం కాదు. ఒప్పుకోవాల్సిన విషయమే. అయితే చరణ్ సీరియస్ గా విశ్లేషించుకోవాల్సింది ఒకటుంది. డైరెక్టర్ బ్రాండ్ మీద కాకుండా తన ఇమేజ్ కు తగ్గ సబ్జెక్టుని, మార్కెట్ కి అనుగుణంగా వర్కౌట్ అయ్యే కథని ఇస్తున్నారా లేదానేది చెక్ చేసుకోవాలి.

అలా చేసి ఉంటే శంకర్ కు మొహమాటం లేకుండా నో చెప్పేవాడు. బుచ్చిబాబుకి సెకండాఫ్ మార్పులు చేయమని పురమాయించేవాడు. అందరూ రాజమౌళిలు కారు కాబట్టి అవసరమైనప్పుడు సూచనలివ్వడంలో తప్పు లేదు. మన శంకరవరప్రసాద్ గారుకి వెంకటేష్ తో గెస్ట్ రోల్ వేయించమని చిరు చెప్పకపోతే క్లైమాక్స్ చప్పగా ఉండేదేమో. ఈ నెమ్మదితనం చరణ్ ఒక్కడి సమస్య కాదు. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ అందరూ ఈ తాను ముక్కలే. ఉన్నంతలో ప్రభాస్ కొంచెం బెటరని చెప్పాలి.