ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ఎన్నో మెగా మూవీస్ తెరకెక్కుతున్నాయి. వాటన్నింట్లోకి వారణాసి రేంజ్ వేరు. ఆ సినిమా కోసం గ్లోబల్ లెవెల్లో ఆడియన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇంకో 11 నెలల్లోనే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్నడూ లేని విధంగా రాజమౌళి ఏడాదిన్నర ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి, పక్కాగా అదే తేదీకి సినిమాను రిలీజ్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు.
వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజయ్యే వారణాసిలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించే ఎపిసోడ్లు చాలానే ఉంటాయనే సంకేతాలు వస్తున్నాయి. అన్నింట్లోకి ఎక్కువ ఆసక్తి రేకెత్తిస్తున్నది మహేష్ బాబు రాముడిగా కనిపించే అరగంట ఎపిసోడే అనడంలో సందేహాలు లేవు. త్రేతాయుగం నేపథ్యంలో ఓ ముఖ్యమైన ఎపిసోడ్ ఉంటుందని, మహేష్ అరగంటసేపు రాముడిగా కనిపిస్తాడని స్వయంగా దర్శకుడు రాజమౌళే ధ్రువీకరించాడు. ఈ పార్ట్ చిత్రీకరణ కూడా ఎప్పుడో పూర్తి చేసేశారు.
ఈ ఎపిసోడ్ గురించి ఇంతకుముందే గొప్పగా మాట్లాడారు రచయిత విజయేంద్ర ప్రసాద్. తాజాగా ఒక ఈవెంట్లో ఆయన మరోసారి త్రేతాయుగం ఎపిసోడ్ గురించి గూస్ బంప్స్ ఇచ్చే మాటలు చెప్పారు. గత ఏడాది రిలీజ్ చేసిన వారణాసి గ్లింప్స్‌లో కనిపించిన రాముడు, కుంభకర్ణుడి పాత్రల గురించి ప్రస్తావిస్తూ.. సినిమాలో ఈ ఇద్దరి మధ్య యుద్ధాన్ని చూపిస్తామని ఆయన వెల్లడించారు. గ్లింప్స్‌లో రాముడిని, కుంభకర్ణుడిని, ఆంజనేయుడిని… తన తోకను మీరు చూశారు కదా అని చెబుతూ.. ఈ ఎపిసోడ్ చూసి అందరూ స్పెల్ బౌండ్ అయిపోతారని విజయేంద్ర చెప్పారు.
ఈ లెజెండరీ రైటర్ దేని గురించీ ఆషామాషీగా మాట్లాడారు. ఊరికే హైప్ కోసం ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వరు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల్లో ముఖ్యమైన ఎపిసోడ్ల గురించి ఆయన చెప్పిన మాటలు నిజమే అయ్యాయి. కాబట్టి వారణాసిలో రాముడికి, కుంభకర్ణుడికి మధ్య వచ్చే యుద్ధ సన్నివేశాలను రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్ది ఉంటాడనడంలో సందేహం లేదు. ఈ ఎపిసోడ్ ఒక్కటి క్లిక్ అయిందంటే వారణాసి ఇండియన్ మూవీ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేయడం ఖాయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates
