అనుపమలో కొత్త కోణం బయటికొచ్చిందే

ఈ మధ్య కనిపించడం కాస్త తగ్గించినా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను మన ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోరు. మొన్న ఏడాది బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కిష్కిందపురితో డీసెంట్ సక్సెస్ అందుకున్న ఈ మలయాళీ భామ ధృవ్ విక్రమ్ బైసన్ లో మరో వైవిధ్యమైన పాత్ర పోషించి ప్రశంసలు అందుకుంది. ఇటీవలే లాక్ డౌన్ అనే మూవీ చేసింది కానీ పెర్ఫార్మన్స్ పరంగా గుడ్ అనిపించుకున్నా కంటెంట్ వల్ల జనాలకి చేరలేదు. తాజాగా మరీచికతో ఆడియన్స్ ని పలకరించింది.

మరీచికలో అనుపమ పరమేశ్వరన్ ని దర్శకుడు సతీష్ కాశెట్టి రెండు షేడ్స్ లో చూపించారు. సంజయ్ అనే యువకుడిని విపరీతంగా ప్రేమించే వెంకటలక్ష్మి అనే క్యారెక్టర్ ని పళ్లకు క్లిప్స్, కళ్లద్దాలు పెట్టి చూపించిన విధానం డిఫరెంట్ గా అనిపించింది. దీంతో పాటు ఇంకో మోడరన్ లుక్ తో ఒక రకమైన షాక్ ఇచ్చారు. మానసికంగా బాధపడుతున్నట్టు ఒకసారి, అన్నీ తెలిసిన తెలివైనదానిలా మరోసారి కనిపించిన వైనం అభిమానులకు సర్ప్రైజ్ అనే చెప్పాలి.

అప్పుడెప్పుడో విక్రమ్ అపరిచితుడులో చేసిన వేరియేషన్స్ మళ్ళీ ఒక హీరోయిన్ పాత్రలో చూపించడం అరుదు. మరీచిక కమర్షియల్ గా నిలబడుతుందా అంటే ఠక్కున అవునని చెప్పలేం. అనుపమ కోసమే సినిమాకు వెళ్లిన వాళ్ళు తన వరకు అసంతృప్తి చెందడం లేదు. ఛాలెంజింగ్ రోల్స్ ఎక్కువగా ఇష్టపడే అనుపమకు మరీచిక కీలకమే కానీ ఎందుకనో ప్రమోషన్స్ పరంగా పెద్దగా సౌండ్ చేయలేదు. పరదా తరహాలో హడావిడి కనిపించలేదు.

బ్లాస్ట్ జోన్, దృశ్యం 3, కాటలాన్, వీరభద్రుడు లాంటి డబ్బింగ్ సినిమాల డామినేషన్ ఎక్కువగా ఉండటం వల్ల స్ట్రెయిట్ మూవీస్ పరిస్థితి అంతంతమాత్రం ఉంది. ఈ మరీచిక దాన్ని ఉపయోగించుకుంటుందో లేదో కానీ అనుపమ పరమేశ్వరన్ కు మాత్రం మంచి పేరే వచ్చేలా ఉంది. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం సమకూర్చడం విశేషం.