పాటలు వాడినందుకు 400 కోట్లు కట్టాలా?

ప్రస్తుతం బాలీవుడ్ దృష్టంతా నెక్స్ట్ బిగ్ రిలీజ్ ‘హై జవానీతో ఇష్క్ హోనా హై’ మీదే ఉంది. వరుణ్ ధావన్ హీరోగా మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే కథానాయికలుగా సీనియర్ దర్శకుడు డేవిడ్ ధవన్ రూపొందించిన చిత్రమిది. భర్త, భార్య.. మధ్యలో ప్రేయసి.. ఈ తరహా ఎంటర్టైన్మెంట్ కథతో తెరకెక్కిక చిత్రమిది.

జూన్ 5న రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దీని ప్రోమోలు, పాటలు అన్నీ జనాల్లోకి సినిమాను బాగానే తీసుకెళ్లాయి. మంచి ఎంటర్టైనర్ అవుతుందనే అంచనాలున్నాయి ఈ చిత్రం మీద. కానీ విడుదల ముంగిట ఈ సినిమాకు పెద్ద షాక్ తగిలింది. ప్రముఖ నిర్మాణ సంస్థ పూజా ఎంటర్టైన్మెంట్స్ ఏకంగా రూ.400 కోట్లకు ఈ చిత్ర మేకర్స్ మీద దావా వేయడం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.

తమ సంస్థలో తెరకెక్కిన ఐకానిక్ హిట్ మూవీ ‘బీవీ నంబర్ 1’ నుంచి బాగా పాపులర్ అయిన పాటలను, లిరిక్స్‌ను తమ అనుమతి లేకుండా వాడుకున్నారంటూ ఆ సంస్థ లీగల్ యాక్షన్‌కు రెడీ అయింది. తమకు రూ.400 కోట్ల డబ్బులు చెల్లించడమే కాక.. ఈ పాటలను సినిమా నుంచి తొలగించాలని, సినిమా టైటిల్ కూడా మార్చాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది. ఒకవేళ దర్శకుడు డేవిడ్ ధావన్ ఈ డిమాండ్లను పట్టించుకోకపోతే ఇంకో రూ.100 కోట్లు అదనంగా పరిహారం చెల్లించాలని ఆ సంస్థ స్పష్టం చేసింది.

ఐతే అనుమతి లేకుండా పాటలు వాడుకుంటే.. మరీ వందల కోట్ల నష్టపరిహారం కోరడమేంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి పాత పాటలను ఒక మాట చెప్పి వాడేసుకుంటూ ఉంటారు. అలా చెప్పని పక్షంలో వార్నింగ్ ఇస్తుంటారు. కానీ పూజా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ మరీ ఈ స్థాయిలో డిమాండ్లు చేయడం చర్చనీయాంశం అయింది. పూజా సంస్థకు ‘బడేమియా చోటేమియా’ సహా కొన్ని సినిమాల వల్ల భారీ నష్టాలు వాటిల్లాయి. ఆ నష్టాలన్నింటినీ ఇలా భర్తీ చేసుకోవాలనుకుంటున్నారా అంటూ కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్లు.