జగపతికి సుకుమార్ ఇచ్చిన షాక్

విలన్, క్యారెక్టర్ పాత్రల్లోకి మారాక జగపతి బాబుకు ‘ది బెస్ట్’ అనదగ్గ రోల్స్ ఇచ్చిన దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ‘నాన్నకు ప్రేమతో’లో కృష్ణమూర్తి అనే స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి ఎంతగా మెప్పించారో.. ‘రంగస్థలం’లో ప్రెసిడెంట్ పాత్రలో అంతకుమించి ఆకట్టుకున్నారు. ‘పుష్ప’ సినిమాలో సైతం ఆయన పాత్రకు మంచి రెస్పాన్సే వచ్చింది. తనకు ఎంతో నచ్చిన దర్శకుల్లో సుకుమార్ ఒకడని చెబుతూ.. ఆయన చిన్న చిన్న విషయాలను కూడా ఎంతగా పట్టించుకుంటారో, ఎంత సూక్ష్మ పరిశీలన ఉంటుందో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు జగపతిబాబు.

‘పుష్ప’ సినిమాలో తాను చేసిన సెంట్రల్ మినిస్టర్ పాత్ర కోసం డబ్బింగ్ చెప్పాక, ఎలా ఉందో వినమంటూ వాయిస్ మెసేజ్‌ పంపాడట జగపతిబాబు. ఐతే అది వినగానే కూర్చుని వద్దు, నిలుచుని, నడుస్తూ డబ్బింగ్ చెప్పండి అంటూ మెసేజ్ ఇచ్చాడట సుకుమార్.

తాను కూర్చుని డబ్బింగ్ చెప్పిన విషయం సుకుమార్‌కు ఎలా తెలిసిందా అని తాను షాకైపోయానని.. సుకుమార్ అబ్జర్వేషన్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది ఉదాహరణ అని జగపతి చెప్పాడు. డబ్బింగ్ థియేటర్లో నడవడానికి అవకాశం ఉండదని.. దీంతో ఒక మైక్ తీసుకుని బయట నడుస్తూ తన వాయిస్ రికార్డ్ చేయించానని జగపతి వెల్లడించాడు.

సుకుమార్ లాగే ఆయన శిష్యుడు బుచ్చిబాబు సైతం డబ్బింగ్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాడని.. ‘పెద్ది’లో అప్పల సూరి పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి తన కెరీర్లో ఎన్నడూ పడనంత కష్టం పడ్డానని జగపతి చెప్పాడు. ఈ పాత్ర భాష, యాస చాలా భిన్నంగా ఉంటాయని.. వాటిని పట్టుకుని, పాత్రలోని ఎమోషన్‌కు తగ్గట్లు డబ్బింగ్ చెప్పడం చాలా కష్టమైందని.. రోజు మొత్తంలో రెండే రెండు డైలాగులు డబ్బింగ్ చెప్పిన సందర్భం కూడా ఉందని ఆయన చెప్పారు. తన కెరీర్లో ది బెస్ట్ క్యారెక్టర్లలో అప్పలసూరి ఒకటని ఆయనన్నారు.