టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకుమార్ తొలి చిత్రం ‘ఆర్య’కు అద్భుతమైన సంగీతం అందించి ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంలో కీలక పాత్ర పోషించాడు దేవిశ్రీ ప్రసాద్. ఇక సుకుమార్ చివరగా తీసిన ‘పుష్ప-2’ చిత్రానికి కూడా దేవినే మ్యూజిక్ డైరెక్టర్ అన్న సంగతి తెలిసిందే. 20 ఏళ్లకు పైగా సాగిన ప్రయాణంలో సుకుమార్ మధ్యలో కూడా ఏ ఒక్క సినిమాకూ వేరే సంగీత దర్శకుడితో పని చేయలేదు. ఆ సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ ప్రసాద్ ఉండాల్సిందే.
ఐతే ఎన్నడూ లేని విధంగా ‘పుష్ప-2’ టైంలో వీళ్లిద్దరి మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. కొన్ని సన్నివేశాలకు దేవిశ్రీ ప్రసాద్ బీజీఎం నచ్చక వేరే మ్యూజిక్ డైరెక్టర్లను ఆశ్రయించాడు సుకుమార్. దీనికి దేవి ఎంత నొచ్చుకున్నాడో స్టేజ్ మీదే చూపించేశాడు. కానీ తర్వాత సుకుమార్, దేవిల మధ్య అంతా సర్దుకున్నట్లే కనిపించింది. మరి సుకుమార్ తర్వాతి సినిమా విషయంలో ఏం జరుగుతుందా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ రూపొందించబోయే తర్వాతి సినిమాకు సంగీత దర్శకుడు మారబోతున్నాడని ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది. కెరీర్లో తొలిసారిగా హీరోగా మారి ‘యల్లమ్మ’ సినిమా చేస్తున్నాడు దేవి. ఈ నేపథ్యంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బీజీఎం కూడా అతను చేయలేదు. ఆ బాధ్యతలు తమన్ తీసుకున్నాడు.
ఓవైపు దేవిశ్రీ పనితనం తగ్గుతోందన్న విమర్శలకు తోడు.. ఇంకోవైపు అతను నటన వైపు అడుగులేయడంతో సంగీత దర్శకుడిగా తన భవిష్యత్తు మీద నీలినీడలు కమ్ముకుంటున్నాయి. గతంలో వరుసగా దేవితో జట్టు కట్టిన సుకుమార్ లాంటి దర్శకులు అతడికి దూరం అయిపోయినా.. సుకుమార్ మాత్రం అతణ్ని విడిచిపెట్టలేదు. ఇప్పుడు సుక్కు కూడా వదిలేస్తే దేవి పనైపోయిందనే భావన మరింత పెరిగిపోతుంది.
కానీ వాస్తవం ఏంటంటే.. చరణ్ సినిమాకు సంబంధించి సుకుమార్ ఏ టెక్నీషియన్లతో పని చేయాలనే విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇంకా సినిమా ఆ దశకు వెళ్లలేదు. కథ లాక్ చేశారు తప్పితే, ఇంకా ఫుల్ స్క్రిప్టే రెడీ కాలేదు. మరి కొన్ని నెలల తర్వాత కానీ స్క్రిప్టు లాక్ అవ్వదు. ఆ తర్వాతే టెక్నీషియన్ల గురించి ఆలోచిస్తారు. అప్పటికి దేవిశ్రీ ఏమాత్రం అందుబాటులో ఉంటాడు.. ఈ కథకు అతను కాకుండా వేరొకరు న్యాయం చేయగలరా.. ఇవన్నీ ఆలోచించాకే సుకుమార్ తుది నిర్ణయం తీసుకుంటాడని సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates