కీర్తి సురేష్‌ను కెరీర్ ఆరంభంలో చూసిన వాళ్లంతా.. ఆమె ఫిజిక్ గురించి కామెంట్లు చేసేవారు. నేను శైలజ, నేను లోకల్, సామి లాంటి చిత్రాల్లో ఆమె చాలా బొద్దుగా కనిపించింది. అప్పటికి నటిగా కూడా ఆమెకు అంత గుర్తింపేమీ లేదు. ఐతే ‘మహానటి’ సినిమాతో అంతా మారిపోయింది. ఆ చిత్రంలో సావిత్రి పాత్రలో రకరకాల లుక్స్‌లో కనిపించాల్సి రావడంతో కొంచెం అవతారం మార్చుకుంది.
ఆ సినిమా తర్వాత ఆమె లుక్‌లో పూర్తిగా మార్పు వచ్చింది. బొద్దు భామ అనే గుర్తింపు పోయి.. బక్క భామ అనే పేరొచ్చింది. ఒక దశలో మరీ చిక్కిపోయి జీవం కోల్పోయినట్లూ కనిపించింది కీర్తి. కానీ తర్వాత బ్యాలెన్స్‌డ్ లుక్‌లోకి మారింది.
ఐతే కెరీర్ ఆరంభంలో తాను సన్నబడాల్సిన అవసరమే లేదన్న అభిప్రాయంతో ఉండేదాన్నని.. కానీ తర్వాత పట్టుదలతో లుక్ మార్చుకున్నానని కీర్తి చెప్పింది. తాను బరువు తగ్గడం మీద రకరకాల కామెంట్లు కూడా ఎదుర్కొన్నట్లు ఆమె చెప్పింది.
‘‘నా ఫిట్‌నెస్ జర్నీ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. దాని గురించి పంచుకోవడానికి ఇదే సరైన సమయం. 2013లో నటిగా కెరీర్ ఆరంభించినపుడు నాకేమీ తెలియదు. చాలామంది లాగే జిమ్ అన్నది అవసరం లేదని అనుకునేదాన్ని. కానీ ‘మహానటి’ కోసం కొంచెం లుక్ మార్చుకోవాల్సి వచ్చింది. ఆ సినిమా తర్వాత కొంచెం ఖాళీ వచ్చినపుడు నేనెందుకు జమ్‌కు వెళ్లి బరువు తగ్గకూడదు అనిపించింది. ఆహారపు అలవాట్లు కూడా మార్చుకున్నాను.
ఎక్కువ ప్రొటీన్, తక్కువ కార్బోహైడ్రేట్లు తీసుకోవడం మొదలుపెట్టా. వర్కవుట్లు కూడా చేసి 9 నెలల్లో 10 కిలోల బరువు తగ్గాను. కొందరు నేను సన్నబడడం చూసి సర్జరీ చేయించుకుందంటూ కామెంట్లు చేశారు. అవి కొంచెం బాధ కలిగించాయి. కానీ నేను నా శరీరం మెరుగ్గా ఉండడానికి ఎప్పుడూ ఆరోగ్యకరమైన పద్ధతులే పాటిస్తా.
2020 నుంచి యోగా చేయడం మొదలుపెట్టాక నా ఒంటిలో ఇంకా మంచి మార్పు వచ్చింది. ఒకప్పుడు జిమ్, యోగా లాంటి నాకు ఇష్టం లేనివి ఇప్పుడు వదిలిపెట్టలేనివిగా మారాయి’’ అని కీర్తి చెప్పింది. ఈ మలయాళ భామ ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘రౌడీ జనార్దన’ చిత్రంలో నటిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates