ర‌జినీ నిష్క్ర‌మ‌ణ‌ పై క‌మ‌ల్ ఏమ‌న్నాడంటే..

త‌న రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న అభిమానులను తీవ్ర నిరాశ‌కు గురి చేస్తూ మంగ‌ళ‌వారం ప్ర‌క‌ట‌న చేశాడు సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్. త‌న ఆరోగ్య ప‌రిస్థితి దృష్ట్యా ప్ర‌స్తుత క‌రోనా టైంలో తాను రాజ‌కీయాల్లోకి రాలేన‌ని ర‌జినీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతానికి పార్టీ పెట్ట‌ట్లేద‌ని ఆయ‌న తేల్చేశారు. ఇప్ప‌టికే 70వ ప‌డిలో ఉన్న ర‌జినీ భ‌విష్య‌త్తులోనూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చే అవ‌కాశం లేన‌ట్లే.

ఆయ‌న పొలిటిక‌ల్ కెరీర్ మొద‌లు కాకుండానే ముగిసిపోయింద‌న్న‌మాట‌. ర‌జినీ నిర్ణ‌యాన్ని కొంద‌రు అభిమానులు అర్థం చేసుకున్నప్ప‌టికీ.. కొంద‌రు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ‌లో ఆశలు రేకెత్తించి ఇలా ప్ర‌క‌ట‌న చేయ‌డం ఏంటి అంటున్నారు. ర‌జినీ ఇంటి ముందు కొంద‌రు అభిమానులు ఆందోళ‌న కూడా చేస్తున్నారు.

కాగా ఇంకా రాజ‌కీయ వ‌ర్గాల నుంచి ర‌జినీ నిర్ణ‌యంపై స్పంద‌న‌లు వెల్ల‌డి కాలేదు. కాగా ర‌జినీకి అత్యంత ఆప్త మిత్రుడు.. ఇప్ప‌టికే రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి పార్టీని న‌డిపిస్తున్న క‌మ‌ల్ హాస‌న్.. ఆయ‌న తాజా నిర్ణ‌యంపై స్పందించాడు. రజినీకాంత్ ప్రకటనపై ఆయన అభిమానుల్లాగే తాను కూడా నిరాశ చెందానని అన్న క‌మ‌ల్.. త‌న మిత్రుడి ఆరోగ్యమే తనకు అన్నింటికంటే ముఖ్యమని స్ప‌ష్టం చేశాడు.

ఇప్పుడు ర‌జినీని తాను క‌ల‌వ‌బోన‌ని.. ఎన్నికల ప్రచారం తర్వాత త‌న మిత్రుడిని క‌లుస్తాన‌ని క‌మ‌ల్ తెలిపాడు. క‌మ‌ల్ అన్న‌ట్లుగా ర‌జినీ ఆరోగ్యం దృష్ట్యా ఆయ‌న రాజ‌కీయాల్లోకి రాక‌పోవ‌డ‌మే మంచిద‌న్న‌ది ఆయ‌న శ్రేయోభిలాషుల మాట‌. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కూడా చేసుకున్న ర‌జినీ.. ప్ర‌స్తుత క‌రోనా టైంలో రాజ‌కీయాల కోసం బ‌య‌ట తిరిగితే ఆయ‌న ప్రాణాల‌కే ముప్పు వాటిల్ల‌వ‌చ్చ‌న్న‌ది స‌న్నిహితుల ఆందోళ‌న‌. అందుకే ఆయ‌నీ నిర్ణ‌యం తీసుకున్నార‌న్న‌ది స్పష్టం.