మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ ప్రహసనం క్రమంగా ఫ్యాన్స్ ఎమోషన్స్ ని క్యాష్ చేసుకోవడం. అర్థం లేని పోటీతో కొత్త సినిమాలను దెబ్బ తీయడం దాకా వెళ్ళిపోయింది. పోనీ అప్పుడప్పుడు ఒకటి రెండు చేస్తారా అంటే అదీ లేదు. నెలకు కనీసం నాలుగైదు లేనిదే మాకు నిద్ర పట్టదనే రేంజ్ లో వీటిని రుద్దుతూనే ఉన్నారు. సోషల్ మీడియాని వాడుకుని, అభిమానులను టెంప్ట్ చేసి షోలతో పాటు జేబులను నింపుకుంటున్నారు.

ఈ నెలాఖరున సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఏకంగా మూడు రీ రిలీజులు వస్తున్నాయి. అతిధి, భరత్ అనే నేను, 1 నేనొక్కడినేని థియేటర్లకు తీసుకొస్తున్నారు. విచిత్రంగా వీటిలో రెండు కమర్షియల్ ఫెయిల్యూర్స్ కావడం గమనార్హం . అయినా కృష్ణగారి పుట్టినరోజుకి సింహాసనం, మోసగాళ్లకు మోసగాడు, అగ్ని పర్వతం, అల్లూరి సీతారామరాజు లాంటివి వేయాలి కానీ ఇలా వాళ్ళబ్బాయివి గంపగుత్తగా విడుదల చేయడం వెనుక మర్మం ఏమిటో చేసినోళ్లకే తెలియాలి.

ముందుగా అనౌన్స్ చేసిందైతే అతిథినే. మిగిలినవి తర్వాత తోడయ్యాయి. ఇలా ఒకేసారి మూడు తీసుకొస్తే మేమేం చేయాలంటూ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేయడంలో న్యాయముంది. టికెట్ రేట్లు తగ్గించకుండా ఇప్పుడున్న ధరలతోనే ఇన్నేసి పాత సినిమాలు చూడమంటే ఎవరైనా ఏం చేస్తారు. అసలే మహేష్ అభిమానులు సంబరాలు చేసుకోవడంలో ముందుంటారు. మురారి, ఒక్కడు, పోకిరికి అద్భుతమైన కలెక్షన్స్ రావడానికి కారణం వీళ్ళే.

ఏదైతేనేం ఇది ఎవరూ ఆపేది కాదు కానీ కొంత నియంత్రణ అయితే అవసరముంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇలాంటి రీ రిలీజుల వల్ల కొత్త సినిమాలు ఎఫెక్ట్ అయిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఖలేజా, డార్లింగ్, ఖుషి లాంటివి జనాన్ని ఇతర సినిమాలకు వెళ్లనివ్వకుండా చేసాయి. ఈ మధ్య థర్డ్ పార్టీ డిస్ట్రిబ్యూటర్ల పేరుతో కొత్తవాళ్లు అదే పనిగా పాత సినిమాలను రిలీజ్ చేయడమే పనిగా పెట్టుకోవడంతో ఇలాంటి పరిస్థితి తలెత్తుతోంది. దీనికి పరిష్కారం లేనట్టే.