చక్కని అవకాశం చెన్నై చేజారింది

నెల రోజుల క్రితం చెన్నై లవ్ స్టోరీ నుంచి మొదటి పాట రిలీజ్ సందర్భంగా కథకుడు సాయి రాజేష్ ఒక మాట అన్నారు. జూన్ 25 పెద్ది వస్తుంది కాబట్టి తాము వేరే డేట్ చూసుకుంటామని, అందుకే విడుదల తేదీ ఫిక్స్ చేయలేదని చెప్పుకొచ్చారు. తీరా చూస్తే పెద్ది ఆ మాట మీద నిలబడక జూన్ 4 కి ప్రీ పోన్ అయ్యింది. లెనిన్ జూన్ 26కి కట్టుబడి ఎలాంటి వాయిదాలు లేవనే క్లారిటీ ఇచ్చేసింది. ఇక్కడ విషయం ఏంటంటే చెన్నై చేజార్చుకున్న బంగారం లాంటి ఛాన్స్ గురించి.

మణిశర్మ స్వరపరిచిన మొదటి పాట వచ్చాక చెన్నై లవ్ స్టోరీ మీద పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. పది మిలియన్ల వ్యూస్ తో సాంగ్ బాగా రీచ్ అయ్యింది. బిజినెస్ వర్గాల్లో క్రేజ్ మొదలయ్యింది. కానీ నిర్మాతలు సరైన ప్లానింగ్ తో లేకపోవడంతో సమ్మర్ లో చాలా స్లాట్స్ మిస్ చేసుకున్నారు. ఏప్రిల్, మే నెలల్లో ఒక్కటంటే ఒకటి యునానిమస్ మూవీ రాలేదు. ప్రమోషన్ల హడావిడి చేసినా కనీసం ఓపెనింగ్స్ తెచ్చుకోవడంలో విఫలమైనవి మంచి వేసవిలో బోలెడున్నాయి.

ఇలాంటి సీజన్ లో చెన్నై లవ్ స్టోరీ వచ్చి ఉంటే బాగా వర్కౌట్ అయ్యేది. కిరణ్ అబ్బవరం ఇమేజ్, హీరోయిన్ గౌరీప్రియాతో పాటు కంటెంట్ ని సరైన రీతిలో ప్రమోట్ చేసుకుని ఉంటే బాక్సాఫీస్ వద్ద గట్టిగా నిలబడేది. యావరేజ్ దగ్గర ఊగిసలాడుతున్న గోదారి గట్టుపైనకు ఓ మోస్తరు కలెక్షన్లు వస్తున్నాయంటే కారణం ఆడియన్స్ కి అంతకన్నా ఆప్షన్ లేకపోవడమే. ఒకవేళ దీనికి ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే సుమంత్ ప్రభాస్ ఖాతాలో పెద్ద విజయం నమోదయ్యేది.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం చెన్నై లవ్ స్టోరీ జూలై 10 ఆప్షన్ చూస్తోందట. త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వొచ్చని సమాచారం. అప్పటికంతా పెద్ది నాలుగు వారాల థియేటర్ రన్ పూర్తయి ఉంటుంది. లెనిన్ కూడా నెమ్మదీస్తుంది కనక మంచి ఛాయస్ కావొచ్చు. కానీ అదే డేట్ కి ఆనంద్ దేవరకొండ ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ విడుదల చేసే ఆలోచన జరుగుతోందట. ఇలాంటి క్లాష్ అంత సేఫ్ కాదు. పోనీ ఒక వారం ముందు వద్దామంటే జూలై 3 భారీ ఫాంటసీ మూవీ నాగబంధం ఉంది.