గత ఏడాది తెలుగులో సర్ప్రైజ్ హిట్ అయిన సినిమాల్లో రాజు వెడ్స్ రాంబాయి ఒకటి. కొత్త దర్శకుడు సాయిలు కంపాటి.. తమ ఊరిలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలన ఫలితాన్ని అందుకుంది. అందరూ కొత్త వాళ్లే కలిసి చేసిన సినిమా అయినప్పటికీ.. ఈ కథను సహజంగా తీర్చిదిద్దిన తీరు.. షాక్‌కు గురి చేసి, గుండెల్ని పిండేసే క్లైమాక్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి.
మంచి రివ్యూలు, టాక్ రావడంతో సినిమా ఘనవిజయాన్నందుకుంది. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన సినిమాకు కొన్ని రెట్ల ఆదాయం వచ్చింది. ఈ చిత్రంలో అఖిల్ రాజ్, తేజస్వి రావు జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఐతే ఇందులో అఖిల్ రాజ్ స్థానంలో హీరోగా చేయాల్సింది యువ నటుడు సుమంత్ ప్రభాస్ అట. ముందుగా దర్శకుడు సాయిలు ఈ కథను ఈ కుర్రాడికే చెప్పాడట. కానీ అతను ఈ సినిమాలో నటించలేనన్నాడట.
ఐతే సుమంత్ ప్రభాస్‌కు రాజు వెడ్స్ రాంబాయి కథ నచ్చక ఈ సినిమా చేయకపోవడం లాంటిదేమీ లేదట. నిజానికి రాజు వెడ్స్ రాంబాయి స్టోరీ వినగానే ఇది బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందని అని సుమంత్ చెప్పాడట. తనకు కథతో పాటు హీరో పాత్ర కూడా చాలా నచ్చిందని.. కానీ అప్పటికే మేం ఫేమస్ రూపంలో ఒక తెలంగాణ రూరల్ లవ్ స్టోరీ చేశానని.. తర్వాత రాజు వెడ్స్ రాంబాయి కూడా చేస్తే అదే తరహాలో ఉంటుందని.. తన మీద ఒక ముద్ర పడిపోతుందని.. అందుకే ఈ సినిమా తాను చేయడం కరెక్ట్ కాదనుకుని వెనక్కి తగ్గానని సుమంత్ వెల్లడించాడు.
తర్వాత తాను చెప్పినట్లే రాజు వెడ్స్ రాంబాయి బ్లాక్ బస్టర్ అయిందని.. దీంతో తాను చాలా సంతోషించానని.. తనకు సాయిలు కథ ఎలా చెప్పాడో, అంతకంటే స్క్రీన్ మీద సినిమా బాగా తీశాడని సుమంత్ తెలిపాడు. రాజు వెడ్స్ రాంబాయి బదులు సుమంత్.. గోదావరి ప్రాంత నేపథ్యంలో తెరకెక్కిన గదారి గట్టుపైన సినిమాలో నటించాడు.
తెలంగాణ కుర్రాడైనప్పటికీ.. ఇందులో ఆంధ్రా అబ్బాయిలో బాగా ఒదిగిపోయాడు. ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ముందు రోజే దీనికి పెయిడ్ ప్రిమియర్స్ వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates