మమ్ముట్టి & మోహన్ లాల్ మెప్పించారా

మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు విషయం కాదు. భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్ల వీళ్లకు అభిమానులు ఉన్నారు. యాత్ర, మనమంతా, జనతా గ్యారేజ్ లాంటి సినిమాల ద్వారా మనకు కూడా సుపరిచితమే. అందుకే పాట్రియాట్ మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. వీళ్లకు తోడు నయనతార, ఫహద్ ఫాసిల్, కుంచకో బోబన్ లాంటి క్రేజీ యాక్టర్స్ తోడవ్వడంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి.

కాకపోతే తెలుగు వెర్షన్ ని సమాంతరంగా రిలీజ్ చేయలేకపోయారు. అయితేనేం హైదరాబాద్ మూవీ లవర్స్ కు కొన్ని మలయాళం షోలు పెట్టడంతో వాటికి జనాలు వెళ్లారు. సరే ఇంత పెద్ద మల్టీస్టారర్ ఎలా ఉందనే ఆసక్తి కలగడం సహజం. ట్విస్ట్ ఏంటంటే పాట్రియాట్ అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోలేదని కేరళ మీడియా రివ్యూలు స్పష్టం చేస్తున్నాయి. మూడు గంటలకు దగ్గరగా ఉన్న నిడివిని ఎంగేజింగ్ గా తీయడంలో దర్శకుడు తడబడినట్టు వాటి సారాంశం.

డేనియల్ జేమ్స్ (మమ్ముట్టి) అనే రిటైర్డ్ ఏజెంట్ మీద దేశద్రోహం ఆరోపణలు వస్తాయి. అవి తప్పని నిరూపించుకునేందుకు కల్నల్ రహీం నాయక్ (మోహన్ లాల్) తో చేతులు కలుపుతాడు. ఈ ఇద్దరు కలిసి దేశ విచ్చిన్నం కోసం శత్రువులు తయారు చేసిన పెరిస్కోప్ అనే ప్రమాదరకమైన స్పై వేర్ ని కనిపెడతారు. దీన్ని అడ్డుకోకపోతే వినాశనం జరుగుతుందని గురిస్తారు. అదెలా చేస్తారనేది మిగిలిన కథ. లైన్ పరంగా మరీ కొత్తగా లేకపోవడం పేట్రియాట్ అసలు లోపం.

దర్శకుడు మహేష్ నారాయణన్ ఇద్దరు లెజెండ్స్ ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలని నిర్లక్ష్యం చేయడం వల్ల విపరీతమైన ల్యాగ్ అనిపిస్తుంది. చాలా ఓపిక తెచ్చుకుంటే ఇంటర్వెల్ దాకా ఓ మోస్తరుగా ఓకే అనిపిస్తుంది కానీ సెకండాఫ్ లో కథనం మరీ నీరసం తెప్పించేస్తుంది. ఆర్ఆర్ఆర్ లో చరణ్, తారక్ ని రాజమౌళి బ్యాలన్స్ చేసినట్టుగా బహుశా ఇంకెవరికి సాధ్యం కాదేమో. ఇంతకీ పాట్రియాట్ డబ్బింగ్ వెర్షన్ థియేటర్ రిలీజ్ ఉంటుందో లేదో చూడాలి.